Gun firing in Rangareddy: ఔటర్ రింగురోడ్డుపై కాల్పులు కలకలం సృష్టించాయి. కారులో వచ్చిన అగంతుకులు లారీడ్రైవర్‌పై కాల్పులు జరిపారు. శనివారం రాత్రి ఔటర్ రింగురోడ్డుపై ఐరన్ లోడ్‌తో ఓ లారీ(ఎన్‌ఎల్ 01 ఏఎఫ్ 3226) వెళ్తోంది. దాన్ని వెంబడిస్తూ స్విఫ్ట్‌కారులో వచ్చిన ఓ వ్యక్తి శంషాబాద్ తుక్కుగూడ ఎగ్జిట్ 14 వద్దకు రాగానే అకస్మాత్తుగా లారీ డ్రైవర్‌పై ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. గురితప్పటంతో డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. కాల్పుల్లో లారీ అద్దాలు పగిలిపోయాయి. లారీ డ్రైవర్ డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారమిచ్చాడు. ప్రమాదం నుంచి బయటపడిన డ్రైవర్ పేరు మనోజ్. ఐరన్‌లోడ్‌తో మెదక్ నుంచి కేరళలోని కొచ్చి నగరానికి బయల్దేరినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నాడు.
కాల్పుల ఘటన అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల ముఠా పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు మూడు బృందాలు ఏర్పాటు చేశారు. గతంలోనూ ఔటర్‌పై తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్‌లకు చెందిన దోపిడీ దొంగలు హల్‌చల్ చేశారు. విలువైన వస్తువులు రవాణా చేసే లారీలు, కంటైనర్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. డ్రైవర్లను బెదిరించటం, హతమార్చటం చేస్తున్నారు. ఇటీవల లారీ టైర్లు, సబ్బులతో వెళ్తున్న లారీలను అడ్డగించి దోచుకున్న ముఠాలను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుత ఘటనకూ ఇవే ముఠాలు కారణం కావచ్చని ఓ పోలీసు అధికారి తెలిపారు. కాల్పుల అనంతరం నిందితుడు వరంగల్ వైపు వెళ్లి పరారై ఉండవచ్చని భావిస్తున్నారు.
ఇవీ చదవండి: