RTC Driver Suicide in Yadadri: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట బస్ డిపోలో ఆర్టీసీ డ్రైవర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ నెలలోనే ఆయన ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఇంతలోనే ఇలా జరగడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. డిపో సహాయ మేనేజర్ సైదులు, పోలీసులు, కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్‌లోని బీఎన్‌రెడ్డి నగర్లో నివాసం ఉంటున్న ఎం.కిషన్(60) యాదగిరిగుట్ట డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెలలో ఆయన ఉద్యోగ విరమణ చేయనున్నారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కిషన్ భార్య ఆసుపత్రిలో చేరారు.
దీంతో నెల రోజులు సెలవు తీసుకొని.. ఆదివారమే తిరిగి ఆయన విధుల్లో చేరారు. మానసిక సమస్యలతో బస్సు నడపలేనని, మరేదైనా పని చెప్పాలని కోరారు. అప్పటి నుంచి అతనికి భువనగిరి బస్టాండ్‌లో హైదరాబాద్ స్టేజీ వద్ద కంట్రోలర్ పని అప్పగించారు. కానీ బుధవారం రాత్రి ఇంటికి వెళ్లకుండా బస్ డిపోకు వచ్చారు. డిపోలో ఇంధన కేంద్రం వద్ద ఆగి ఉన్న బస్సు చక్రాల కింద మృతి చెంది కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:Boy Suicide Not Bought Bicycle: సైకిల్ కొనివ్వలేదని బాలుడు ఆత్మహత్య