హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బంధువు చనిపోయాడని ఆరోపిస్తూ.. మృతుడి బంధువులు హాస్పిటల్లో ఆందోళనకు దిగారు. ఈ నెల 9న వంశీ కృష్ణ(35) అనే యువకుడు కొవిడ్ లక్షణలతో (covid symptoms) చేరినట్లు.. అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. బాధితుడి పరిస్థితి విషమించినా.. రెండు రోజుల పాటు వైద్యులు కనీసం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిని సీజ్ (hospital seize) చేయాలని డిమాండ్ చేస్తూ.. ఆందోళనకు దిగారు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా.. మృతుడి బంధువులు శాంతించడం లేదు.
రూ. 20 లక్షల బిల్ వేసి..
ఆసుపత్రిలో చేరిన నాలుగు రోజుల తర్వాత.. ఊపిరితిత్తుల్లో సమస్య వచ్చిందని వైద్యులు చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చికిత్స కోసం (covid treatment) దాదాపు రూ. 20 లక్షలు వసూలు చేశారని వాపోయారు. రోజుల తరబడి ఏ చికిత్స చేస్తున్నారో చెప్పకుండా.. నిర్లక్ష్యంగా అతడి మరణానికి కారణమయ్యారని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
'దేవుళ్లనుకొని ఆసుపత్రుల కొస్తాం'
'నా అన్న చావలేదు.. చంపేశారు. డాక్టర్లు.. దేవుళ్లనుకొని వస్తాం. ధనార్జనే ధ్యేయంగా.. ఇలా ప్రాణాలు పోయేదాకా పట్టించుకోరా..? ట్రీట్ మెంట్ రాంగ్ ఉందని అడుగుతూనే ఉన్నా. ఎంతో మంది గుడ్డిగా వచ్చి.. ఇక్కడ చేరుతున్నారు. నా అన్న ఎలాగో తిరిగి రాడు. ఆయనకు జరిగినట్లు.. ఎవరికీ జరగకూడదు. వైద్యులపై వెంటనే చర్యలు తీసుకుని.. ఆసుపత్రిని సీజ్ చేయండి.'
- మృతుడి సోదరి
డబ్బంతా ఇచ్చేస్తామంటున్నారు..!
ఘటనపై.. ఆసుపత్రి యాజమాన్యాన్ని సంప్రదించాం. చికిత్స విషయంలో.. వైద్యుల నుంచి సరైన సమాధానం లేదు. గట్టిగా నిలదీస్తే.. మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తామని అంటున్నారు. వారి తప్పు లేకపోతే.. డబ్బులు తిరిగి ఎందుకు చెల్లిస్తారు. హాస్పిటల్‌పై చర్యలు తీసుకునేంత వరకూ.. ఇక్కడ నుంచి కదిలేది లేదు.
- మృతుడి బంధువులు.
మృతుని బంధువుల ఫిర్యాదుపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇదీ చదవండి: Accident: ద్విచక్ర వాహనం చెట్టుకు ఢీకొని వ్యక్తి మృతి