కొద్ది రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన యువతి ఓ భవన యజమాని నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయింది. ఈ మధ్యనే మంచి ఉద్యోగంలో చేరి ఆర్థికంగా అండగా నిలబడిందన్న తల్లిదండ్రుల ఆశలను మృత్యువు చిదిమేసింది. పెళ్లి చేసి అత్తింటికి పంపుదామనుకున్న కుమార్తెకు తలకొరివి పెట్టాల్సి రావడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగి పోయింది. హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఓ భవనం రెయిలింగ్ విరిగిపడి యువతి మృతి చెందింది.
విషాదంలో ఇరు కుటుంబాలు
వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్‌కోట జయశంకర్ కాలనీకి చెందిన జెట్టూరి శేఖర్, సత్తమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు రోజా, శ్వేత; కుమారుడు నవీన్ ఉన్నారు. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)లో శేఖర్ ఒప్పంద కార్మికుడు. పెద్ద కుమార్తె రోజా(24) ఎమ్మెస్సీ చదివి ఫార్మసీ కోర్సు చేసింది. కూకట్‌పల్లిలోని అనన్య ఆసుపత్రి సమీపంలో అద్దెకు ఉంటూ ఉంటూ శామీర్‌పేటలోని లాల్‌గడి మలక్‌పేటలోని ఎస్.పి.అక్యూర్ ల్యాబ్ సంస్థలో పనిచేస్తోంది. వికారాబాద్‌లోని మిషన్ ఆసుపత్రి వైద్యుడితో వివాహం చేయాలని నిర్ణయించారు. బుధవారం జరగాల్సిన నిశ్చితార్థం ఏర్పాట్లలో ఇరు కుటుంబాలు మునిగిపోయాయి.
ఇదీ చూడండి: కూతురును రోకలి బండతో కొట్టి చంపిన తల్లి
నూతన వస్త్రాలు తీసుకొనేందుకు స్నేహితురాలు మౌనికతో కలిసి రోజా... మంగళవారం రాత్రి 7.30 ప్రాంతంలో డిజైనర్ వద్దకు వెళ్లింది. ఆమె లేకపోవడంతో దుకాణం ముందు నిరీక్షిస్తుండగా భవనం మూడో అంతస్తు నుంచి పెద్ద రెయిలింగ్ శకలాలు ఆమె తలపై పడటంతో కుప్పకూలింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని బుధవారం సొంతూరికి తరలించారు. మంగళవారమే రావాల్సి ఉండగా, చీకటి పడడంతో బుధవారం తెల్లవారుజామున రావాలని తండ్రి సూచించారు. భవనం ఓ ప్రజాప్రతినిధి సమీప బంధువుది. రెయిలింగ్‌కు పగుళ్లున్నాయని యజమాని దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని పలువురు ఆరోపించారు.
సాయంత్రం 8.30 సమయంలో భాజాపా ఆఫీసుకు వెళ్లేదారిలో ఓ ప్రమాదం జరిగింది. బొటిక్‌లో వస్త్రాలు తీసుకోడానికి వచ్చిన అమ్మాయిపై భవనం పెచ్చులూడి మీదపడ్డాయి. వారంలో ఆమె పెళ్లిఉందట. పెచ్చులు ఊడిపడడం, అదే సమయంలో ఆమె అక్కడ ఉండడంతో తీవ్రంగా గాయపడింది. ఆమెతో ఉన్న స్నేహితురాలు ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. స్థానికుడు.
ఇదీ చూడండి: లారీ, కారు ఢీ... నవ దంపతులు మృతి