Sexual Harassment: శిక్షణ కోసం వచ్చిన నర్సుతో (ఏఎన్ఎం) అసభ్యంగా మాట్లాడారంటూ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాంతీయ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు దేహశుద్ధి చేశారు నర్సు బంధువులు. దీంతో ఆస్పత్రి ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది.
కల్హేర్ మండలం బాచెపల్లి నాగని కుంటతాండకు చెందిన ఓ వివాహిత.. నర్సింగ్ కోర్సు పూర్తిచేసింది. అనంతరం నారాయణఖేడ్ ప్రాంతీయ ప్రభుత్వ ఆస్పత్రిలో శిక్షణ తీసుకుంటోంది. నిన్న మధ్యాహ్నం శిక్షణ పూర్తిచేసుకొని ఇంటికి వెళ్తుండగా.. సూపరింటెండెంట్ నర్సింగ్ చౌహాన్ తన గదిలోకి పిలిచి అసభ్యంగా మాట్లాడారని.. చంపలపై తాకాడని బంధువులకు బాధితురాలు తెలిపింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బంధువులు ఆస్పత్రి ప్రాంగణంలోనే ఇవాళ సూపరింటెండెంట్‌కు దేహశుద్ధి చేశారు.
'నిన్న మధ్యాహ్నం 1.30 గంటలకు శిక్షణ పూర్తి చేసుకొని.. ఇంటికి బయలుదేరాను. అంతలోనే సూపరింటెండెంట్ ఎదురొచ్చి.. ఎంటమ్మ వెళ్లిపోతున్నావ్ అని అడిగారు. బస్సుకు టైం అవుతుంది అందుకే వెళ్లిపోతున్నా అని చెప్పాను. అలా మాటల మధ్యలో ఏమైనా హెల్ప్ చేస్తావా అని అడిగారు. నేను గర్బిణిని డబ్బులైతే ఇవ్వగలుగుతా.. రేపు అన్నయ్యను తీసుకొస్తా అని చెప్పిన.. అన్నయ్య ఏం అవసరం లేదు.. నువ్వే ఏదో చెప్పు అన్నాడు. డబ్బులు తీసుకొని సర్టిఫికేట్ ఏమైనా ఇస్తాడేమోనని.. ఆయన వెంట గదిలోకి వెళ్లాను. నువ్వు ఏం హెల్ప్ చేస్తావని.. ఒకటే అడుగుతున్నాడు. నేనేం హెల్ప్ చేయలేను సార్.. డబ్బులైతే ఇవ్వగలను. అన్నయ్య లేదా భర్తను తీసుకొస్తా అని చెప్పాను. డబ్బులిస్తావ్.. నువ్వు ఏం హెల్ప్ చేస్తావ్ అని ఒకటే మాట అడుగుతున్నాడు. అనంతరం ఫోన్ నంబర్ అడిగారు.. ఆయన నంబర్ తీసుకొన్నా.. అక్కడ నుంచి వచ్చేస్తుండగా.. మూతిమీద చేత్తో మెల్లగా కొట్టాడు.
- బాధితురాలు.
ఈ విషయంపై సూపరింటెండెంట్ నర్సింగ్ చౌహాన్‌ను వివరణ కోరగా.. డ్యూటీకి రెగ్యూలర్‌గా రావాలని చెప్పడంతోనే తనపై కక్షగట్టి దాడిచేశారని చెప్పారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చౌహాన్ తెలిపారు. బాధితురాలు బంధువులు సైతం సూపరింటెండెంట్‌పై ఫిర్యాదు చేశారు. ఇరు వర్గాల ఫిర్యాదుపై కేసునమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. 'నీవు బావనవుతా.. ఏం హెల్ప్ చేస్తావ్' అని సదరు సూపరింటెండెంట్.. బాధితురాలిని అడిగినట్లు ఫిర్యాదు చేశారని ఎస్ఐ తెలిపారు.
ఇదీచూడండి: Sexual Harassment : స్టేషన్లోనే వేధింపులు... చివరికి ట్రైనీ మహిళా ఎస్సైకీ తప్పలేదు!