ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో సిమెంటు లారీ బీభత్సం సృష్టించింది. మదనపల్లి నుంచి పులివెందుల వైపు 42వ నంబర్ జాతీయ రహదారిపై వెళుతున్న లారీ డ్రైవర్ పోలీసులను చూసి వాహనాన్ని దారి మళ్లించాడు. మద్యం సేవించిన తనని పోలీసులు ఇబ్బంది పెడతారని భావించి... వేగంగా కదరి పట్టణంలోకి పోనిచ్చాడు. రోడ్లపై ఉన్న వాహనచోదకులు, పాదచారులపైకి దూసుకొస్తూ.. పరుగులు పెట్టించాడు. రాత్రి పదిన్నర గంటల సమయంలో జరిగిన ఈ ఘటనకు స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి
అప్రమత్తమైన స్థానికులు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు పెట్టారు. మరి కొందరు యువకులు లారీ వెంటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు లారీని వెంబడించారు. మదనపల్లి వైపు నుంచి పులివెందులకు వెళ్లాల్సిన లారీని డ్రైవరు కదిరిలోని ఇందిరా గాంధీ కూడలి నుంచి హిందూపురం వైపు మళ్లించాడు. వాహనం వేగాన్ని అదుపు చేయలేక రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టాడు. ప్రమాదం ధాటికి స్తంభం విరిగి నేలవాలింది.
అదే స్తంభానికి ఆనుకుని ఉన్న మూడు ద్విచక్ర వాహనాలపై లారీ దూసుకుపోగా.. అవి పూర్తిగా దెబ్బతిన్నాయి. హిందూపురం వైపు తీసుకువెళ్లాల్సిన లారీని.. పోలీసులను చూసి దారి మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు. చివరికి... తమతోపాటు స్థానికులు చుట్టుముట్టగా.. సమీపంలో వాహనాన్ని నిలిపి పారిపోయేందుకు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. అనంతరం లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు.
ఇదీ చదవండి: Viral Video: సిలిండర్‌కు కట్టి... ఇనుపచువ్వలతో కొట్టి...