ACB Raids on EX DSP: అవినీతి ఆరోపణలు, ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో హెచ్‌ఎండీఏ విజిలెన్స్ విభాగం మాజీ డీఎస్పీ జగన్ నివాసంలో అనిశా అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ హబ్సిగూడలోని ఆయన నివాసంతో పాటు బంధువులు, కుటుంబసభ్యుల ఇళ్లల్లో సోదాలు జరిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అతనిని అరెస్ట్ చేశారు. జగన్తో పాటు అతని సెక్యూరిటీ గార్డు రామును సైతం అరెస్ట్ చేశారు.
HMDA EX DSP: హెచ్ఎండీఏకు సంబంధించి ఓపెన్ ప్లాట్ విషయంలో కోటేశ్వరరావు అనే వ్యక్తి దగ్గరి నుంచి 4 లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో దాడులు చేశారు. జగన్ నివాసంలో ఇంటికి సంబంధించిన పత్రాలతో పాటు 56 తులాల బంగారం గుర్తించారు. జగన్ బంధువులు, కుటుంబ సభ్యుల నివాసాల్లో కూడా అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. ఆదాయానికి మించి జగన్ ఆస్తులు కూడబెట్టినట్లుగా కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాదాపు 14 గంటల పాటు సోదాలు నిర్వహించారు. బోడుప్పల్, కొర్రెముల, జోడిమెట్లలో వెంచర్ వేసినట్లు అనిశా అధికారులు గుర్తించారు. బినామీ పేరుతో డీఎస్పీ జగన్ పెట్రోల్ బంకు నిర్వహిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: డ్రైనేజీ పైపులో నోట్ల కట్టలు దాచిన 'అవినీతి' అధికారి