కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్నముల్కనూరులో ప్రమాదం చోటుచేసుకుంది. చినముల్కనూరు శివారులోని ఓ వ్యవసాయ బావిలోకి కారు దూసుకెళ్లింది. బావిలో పూర్తిగా కారు మునిగిపోయింది. వ్యవసాయ క్షేత్రానికి పని మీద వెళ్లిన రైతు.. మోటార్ ఆన్ చేద్దామని వెళ్లి చూడగా.. బావిలో ఏదో మునిగినట్లు కనిపించింది. వెంటనే ఇరుగుపొరుగు పొలాల్లో ఉన్న వారిని పిలవగా.. వారంతా వచ్చి బావిలో కారు ఉన్నట్లు గుర్తించారు.
స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారును వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. బావిలో గజ ఈతగాళ్లతో పాటు జేసీబీ సాయంతో కారును బయటకు తీసేందుకు ఎనిమిది గంటలుగా శ్రమిస్తున్నారు. మోటార్ల సహాయంతో నీటిని బయటకు తోడుతున్నారు. క్రేన్ సాయంతో కారు తీయడానికి ప్రయత్నిస్తుండగా వైర్ తెగి మళ్లీ బావిలోనే పడింది. ఇలా దాదాపు పదిసార్లు జరిగింది. బావి 20గజాల లోతు ఉండటం, మొత్తంగా నిండి ఉండటంతో గజ ఈతగాళ్లు లోపలి వరకు వెళ్లలేకపోతున్నారు. ప్రస్తుతానికి నీటిని తోడి రెండు క్రేన్లతో కారు బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. వాహనంలో.. ఇద్దరు లేక ముగ్గురు వ్యక్తులు కనిపించినట్లు స్థానికులు చెబుతున్నారు.
- ఇదీ చదవండి : Corona: ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్