గంజాయిని గుట్టుగా హైదరాబాద్‌కు తరలించి వినియోగదారులకు సరఫరా చేసేందుకు... వేచి ఉన్న ఇద్దరు అంతరాష్ట్ర దుండగులను ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.70 వేల విలువైన 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఒడిశాకు చెందిన బర్ధస్, ఏపీకి చెందిన ప్రసాద్ రాజుగా గుర్తించారు.
గుట్టుగా సరఫరా
ఒడిశాకు చెందిన ఆండ్రి అలియాస్ సాగర్ గంజాయిని కొనుగోలు చేసి ఏజెంట్ల ద్వారా గుట్టుగా వినియోగదారులకు సరఫరా చేస్తున్నారని టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ రాధాకిషన్‌రావు, ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రధాన ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. ఆ రాష్ట్రంలో రూ.1500లకు కేజీ చొప్పున గంజాయిని కొనుగోలు చేసి... ఏజెంట్ల ద్వారా వినియోగదారులకు సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు.
అడ్డగుట్ట వద్ద తనిఖీలు
ఈ క్రమంలో హైదరాబాద్‌లో అందజేసేందుకు శ్రీకాకుళం నుంచి బస్సుల్లో బర్ధస్, ప్రసాద్ రాజు 10 కేజీల గంజాయిని తీసుకుని శుక్రవారం ఉదయం సికింద్రాబాద్‌కు చేరుకున్నారని తెలిపారు. ఇద్దరు నిందితులు అడ్డగుట్ట ఎక్స్‌రోడ్డు వద్ద వేచి ఉండగా... విశ్వసనీయ సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించి వీరిని అదుపులోకి తీసుకున్నారు.
ఆండ్రి కోసం దర్యాప్తు
నిందితులను విచారించిన అనంతరం ప్రధాన నిర్వాహకుడు ఆండ్రిగా గుర్తించారు. ఒడిశాలో ఉన్న ఆయనను అదుపులోకి తీసుకునేందుకు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయితో పాటు నిందితులను తుకారాంగేట్ పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: BLACK MAIL: మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీయించిన పోలీస్