కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో వైరస్ నివారణ కోసం.... వరంగల్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ నిట్ భౌతిక శాస్త్ర విభాగం వారు ఓజోనిట్ అనే పేరుతో స్టెరిలైజేషన్ పరికరాన్ని రూపొందించారు. ఈ పరికరం ఇంట్లో ఉపయోగించే ఫ్రిజ్లాగే ఉంటుందని వారు తెలిపారు. ఈ ఫ్రిజ్లో వస్తువులను ఉంచి ఓజోన్ వాయువును ఉత్పత్తి చేసే మీటను నొక్కుతారు. వస్తువులను 20-25 నిమిషాలు ఓజోన్ వాయువులో ఉంచితే 99.99% శాతం వైరస్, ఫంగస్, బ్యాక్టీరియాను రసాయన రహితంగా శుభ్రం చేస్తుంది.
వస్తువులను శుభ్రం చేసిన అనంతరం ఓజోన్ దానంతట అదే బయటకు వెళ్లేలా ఏర్పాటు చేశారు. పరికరం నుంచి ఓజోన్ వాయువు లీక్ కాకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు రూపకర్తలు తెలిపారు. అతినీల లోహిత కిరణాల కంటే ఈ విధానం ఎన్నో రెట్లు శక్తివంతమైనదని వారు పేర్కొన్నారు. త్వరలోనే ఈ పరికరాన్ని మార్కెట్లోకి విడుదల చేసి సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెస్తామని నిట్ అధికారులు తెలిపారు.
నిట్ భౌతికశాస్త్ర విభాగాధిపతి ఫ్రొఫెసర్ దినకర్ సహకారంతో.... సహ ఆచార్యుడు డా.హరనాథ్, పరిశోధక విద్యార్థి చందర్రావు సంయుక్తంగా ఈ స్టెరిలైజ్డ్ పరికరాన్ని తయారు చేసినట్లు అధికారులు తెలిపారు. పరికారాన్ని రూపొందించిన వారిని నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణా రావు అభినందించారు.