కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు తగిన చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం పంట కోతకు వచ్చిన దశలో వరికోత యంత్రాలను అందుబాటులో ఉంచడానికి ఆర్టీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. లాక్‌డౌన్ నేపథ్యం, వేసవి ఉష్ణోగ్రతల కారణంగా వ్యవసాయ కూలీలు పనులకు వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా రబీ సీజన్‌లో రైతులు సాగుచేసిన వరిపంటను కోసి, నూర్పిడి చేయడానికి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూ ప్రకటన చేసిన సమయంలోనే వ్యవసాయానికి వెసులుబాటు కల్పించాలని నిర్ణయించాయి. జిల్లా అధికారులు రైతులకు అండగా నిలిచేందుకు తగిన చర్యలు చేపట్టారు.
వరికోత యంత్రాలపై దృష్టి..
ప్రస్తుతం సాగునీటి వనరులు సమృద్ధిగా ఉండటంతో జిల్లాలో వరిసాగు విస్తీర్ణం పెరిగింది. రబీలో సాగుచేసిన పంట చేతికి వచ్చింది. వారం రోజులుగా అడపాదడపా కురుస్తున్న అకాల వర్షాలతో చేతికి వచ్చిన వరిపంట నేలకు ఒరిగిపోతోంది. వడగండ్లకు ధాన్యం పొలంలోనే రాలిపోతోంది. మరోవైపు కూలీల కొరత, ఉన్నవారు కూడా కరోనా వైరస్ నేపథ్యంలో పనులకు వెళ్లడానికి జంకుతున్నారు. వెరసి పంట కోత సమస్యగా మారింది. ఇన్నాళ్లు అప్పులు చేసి సాగుచేసిన పంటను దక్కించుకోవడానికి రైతులు వరి కోత యంత్రాలపై దృష్టి సారించారు. రాష్ట్ర ఉన్నతాధికారులు కూడా ఈ విషయంలో రైతులకు సాయం అందించాలని జిల్లాల ఆర్టీఏ, వ్యవసాయ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు.
నారాయణపేటలో 400..
ఏయే జిల్లాలో ఎన్ని వరి కోత యంత్రాలు ఉన్నాయో వివరాలను ఆయా జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులకు సమర్పించాలని రవాణాశాఖ రాష్ట్ర అధికారులు ఆదేశించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న వరికోత యంత్రాల వివరాలను సేకరించి వాటి జాబితాలను వ్యవసాయశాఖ అధికారులకు సమర్పించారు. ప్రధానంగా నారాయణపేట జిల్లాలో 400 వరికోత యంత్రాలు ఉన్నాయి. ఇక్కడ డ్రైవర్లే యజమానులుగా ఉన్నారు.
ఒక్కో యంత్రం రోజుకు 15 ఎకరాలు..
ఒక్కో వరికోత యంత్రం రోజుకు 15 ఎకరాల వరకు పంటను కోస్తుందని ఆర్టీవో శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. జిల్లాలోని వరికోత యంత్రాల వివరాలు, యజమానుల ఫోన్ నంబర్లను సేకరించి, వ్యవసాయ శాఖ అధికారులకు జాబితా అందించామని చెప్పారు. వ్యవసాయ అధికారులే రైతులకు కావాల్సిన యంత్రాలను అందుబాటులో ఉంచడానికి చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.
ఇవీచూడండి: పాన్ మసాలానే కాదు.. పొగాకు ఉత్పత్తినే నిషేధించాలి!