కరోనా కష్టకాలంలో చేతిలో ఉన్న డబ్బును దొంగలించడంతో అష్టకష్టాలు పడుతున్నారు ఈ తల్లీ, కొడుకులు. తమకు న్యాయం చేయాలంటూ సుమారు రెండు నెలలుగా పోలీసుల చుట్టూ తిరుగుతున్నా.. పట్టించుకోవడం లేదంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. చెల్లి పెళ్లికి చేసిన అప్పును తీర్చేందుకు కూడబెట్టుకున్న డబ్బు దోపిడికి గురవడం, లాక్‌డౌన్ కారణంగా తినడానికి తిండి లేక రోడ్డున పడ్డారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ముందే గోడు వెళ్లబోసుకున్న న్యాయం జరగడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ అభాగ్యుడి పేరు సత్యనారాయణ.. నారాయణపేటకు చెందిన ఈయన... తన తల్లితో పాటు హైదరాబాద్‌లోని పూరానపూల్ ప్రాంతంలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. సమీపంలోని సాయిబాబా ఆలయంలో పని చేస్తున్నారు. అతని తల్లి వెంకటమ్మ చుట్టుపక్కల ఇళ్లల్లో పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు.
నాలుగు సంవత్సరాల క్రితం సత్యనారాయణ.. తన చెల్లి పెళ్లి కోసం నారాయణపేట మండలం పేరపళ్ల గ్రామానికి చెందిన సావిత్రమ్మ దగ్గర అప్పు తీసుకున్నారు. సుమారు లక్ష వరకు చెల్లించాల్సి ఉంది. ఆమె అత్యవసరంగా డబ్బులు కావాలని అడగడంతో.. తన దగ్గర దాచుకున్న డబ్బులతో సహా, బంధువులను అడిగి మొత్తం 85వేల రూపాయలు తీసుకొని ఏప్రిల్ 3న తల్లితో కలిసి నారాయణపేటకు బయల్దేరారు. చిన్నచింతకుంట మండలం బండర్‌పల్లికి చేరుకొనేసరికి రాత్రి కావడంతో అక్కడే దిగి సమీపంలోని దత్తాత్రేయ ఆలయంలో పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం.. దాచుకున్న నగదు సంచిని మల్లప్ప అనే వ్యక్తి దొంగలించి పారిపోయాడు. ఆలయ నిర్వాహకులు, గ్రామ సర్పంచ్‌కు విషయం చెప్పినా.. సరైన స్పందన లేకపోవడంతో అదే రోజు చిన్న చింతకుంట పోలీస్ స్టేషన్‌లో తల్లి, కుమారుడు ఫిర్యాదు చేశారు.
దొంగలించిన డబ్బులు ఇప్పించాలని కోరుతూ ఏప్రిల్ 4 నుంచి ఆలయ నిర్వహకులను, గ్రామ సర్పంచ్, సంబంధిత పోలీసులకు మొరపెట్టుకున్నా ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు వారాల కింద ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ముందు గోడు వెళ్లబోసుకోగా... సత్వరం న్యాయం జరిగేలా చూడాలని మహబూబ్‌నగర్ డీఎస్పీ శ్రీధర్‌ను ఆదేశించినట్లుగా పేర్కొన్నారు. అయినా సీసీకుంట ఎస్సై నుంచి ఎలాంటి స్పందన లేకపోగా తిరిగి బెదిరిస్తున్నారంటూ వాపోయారు. ఇప్పటికీ ఎస్సై కేసు నమోదు చేయలేదని.. న్యాయం చేసేందుకు చర్యలు చేపట్టడం లేదన్నారు. చివరగా మహబూబ్‌నగర్ ఎస్పీ వెంకటేశ్వర్లును కలిసేందుకు వచ్చి తెలంగాణ చౌరస్తాలో దిగాలుగు కూర్చోని ఈటీవీభారత్తో తన గోడు వెళ్లబోసుకొని కన్నీటి పర్యంతమయ్యారు.
ఉన్న డబ్బంతా పోవడంతో రోడ్ల పక్కనే పడుకుంటూ దాతలు అందించిన ఆహారంతోనే కాలం వెళ్లదీస్తున్నామని వాపోయారు. హైదరాబాద్‌కు తిరిగి వెళ్దామంటే మూడు నెలలుగా ఇంటి అద్దె చెల్లించలేదని.. ఇంటి యజమాని రానిస్తాడన్న నమ్మకం పోయిందని వాపోయారు.
ఇవీచూడండి: Eatala: ఒక్క ఎకరం ఎక్కువ ఉన్నా ముక్కు నేలకు రాస్తా: ఈటల సతీమణి