తెరాస ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు మేధావులు, ఉద్యోగులు, పట్టభద్రులతో ఉన్న పేగుబంధాన్ని ఎవరూ విడదీయలేరని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. మేధావి వర్గాన్ని తెరాసకు దూరం చేసేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మంలో నిర్వహంచిన బహిరంగ సభలో మంత్రి విపక్షాలపై మండిపడ్డారు. రాష్ట్రంలోని సబ్బండవర్గాలు కేసీఆర్‌తోనే ఉన్నాయన్నారు.
విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కిన భాజపాకు.. రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు లేదని ఎంపీ నామ నాగేశ్వరరావు విమర్శించారు. కేంద్రానికి తెలంగాణ సొమ్ము ఇచ్చిందా.. తెలంగాణనే కేంద్రానికి ఇచ్చిందా లెక్కలు చెప్పేందుకు తాను సిద్ధమని ఉద్ఘాటించారు. ఉద్యోగాల విషయంలో తెరాస చెప్పే లెక్కలు తప్పని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణలో పోరాటాలు, ఉద్యమాలకు వారసత్వం తెరాసదేనని.. విజయాలు కూడా తెరాసకేనని తెలిపారు.