మినీ పురపోరుకు పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ..... రాజకీయ పార్టీల్లో దడ పుడుతోంది. కరోనా ప్రభావంతో ప్రచారాన్ని ఒకరోజు ముందే కుదిస్తూ ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా ప్రచారానికి మిగిలింది నాలుగురోజులే కావడంతో పార్టీలు, బరిలో ఉన్న అభ్యర్థులకు.... టెన్షన్ పట్టుకుంది. ప్రచారం మరింత వేగం పెంచేలా ప్రణాళికలు చేస్తున్నాయి. ముఖ్య నేతలందరినీ రంగంలోకి దింపి డివిజన్ల బాధ్యతలు అప్పగించాయి. అభ్యర్థుల కుటుంబమంతా మద్దతుగా..... కాలనీలను చుట్టేస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సర్వశక్తులొడ్డుతున్నారు.
మాటల యుద్ధం
గెలుపుపై కన్నేసిన అధికార- విపక్షాల మధ్య పురపోరులోనూ మాటలయుద్ధం తారస్థాయికి చేరింది. ఐదేళ్లలో చేసిన అభివృద్ధి అజెండాను తెరాస ప్రస్తావిస్తుండగా........ హామీల అమలులో విఫలమైందంటూ విపక్షాలు తిప్పికొట్టేప్రయత్నం చేస్తున్నాయి. ఖమ్మంలో తెరాస ప్రచార బాధ్యతలను అన్నీ తానే మంత్రి పువ్వాడ అజయ్ నిర్వహిస్తున్నారు. ఐదేళ్లలో పాలకవర్గంచేపట్టిన అభివృద్ధి సహా భవిష్యత్‌లో చేయబోయే కార్యక్రమాలను అధికార పార్టీ ప్రజల్లోకి తీసుకెళుతోంది.
అదే అజెండా
ప్రజా సమస్యలే అజెండాగా కాంగ్రెస్, భాజపా ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. సీఎల్పీ నేత నేత భట్టి విక్రమార్క, ఎన్నికల కన్వీనర్‌గా ఉన్న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ సహా ఇతర జిల్లా ముఖ్యనేతలంతా ఓటర్లను కలుస్తున్నారు. భాజపా మన ఖమ్మం- మన కమలం నినాదంతో ఓటర్ల దరిచేరుతోంది.