Parents Day Celebrations: కరీంనగర్‌లోని ఓ పాఠశాలలో వినూత్నపద్ధతిలో తల్లిదండ్రుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా తల్లిదండ్రులు.. పిల్లల మధ్య ఉన్న అనుబంధాన్నిగుర్తు చేసే విధంగా పాదపూజ కార్యక్రమాన్ని చేపట్టారు. పిల్లలకు తల్లి జన్మనిస్తే, తండ్రి తన గుండెల్లో పెట్టుకుంటాడు. పిల్లలు పుట్టినప్పుటి నుంచి పెరిగే వరకు వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. జీవితాంతరం రక్తాన్ని ధారపోసి పెంచి ప్రయోజకులని చేసిన వారి కృషిని... గుర్తించని కొందరు అమ్మ నాన్నలను సరిగ్గా చూసుకోకండా వారిని నిర్లక్ష్యం చేస్తుంటారు.
కొందరు ప్రబుద్ధులు వారిని వృద్ధాశ్రమంలో సైతం చేర్పిస్తుంటారు. అలాంటి భావాన్ని విడనాడేందుకు... కొన్ని పాఠశాలల్లో పలుస్వచ్చంధ సంస్థలు పిల్లలు.. తమ తల్లిదండ్రులకు పాదపూజ చేసే అవకాశాన్నికల్పిస్తున్నారు. ఇలాంటి వినూత్న కార్యక్రమాన్నికరీంనగర్‌లోని శాతవాహన లయన్స్ క్లబ్ చేపట్టింది. దీనికి తల్లిదండ్రులతో పాటు చిన్నారుల్లోనూ... అనూహ్య స్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు.
నిత్యం అల్లరి చేసే తమ పిల్లలు తాము గర్వపడేలా తమ పాదపూజ చేయడం తమకు ఎంతో ఆనందంగా ఉందని తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. పిల్లలు సైతం తమ అమ్మనాన్నలపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. ఇలా తమ పిల్లలు తమకు పాదపూజ చేయడం తమకు ఎంతో సంతృప్తినిచ్చిందని అంటున్న తల్లిదండ్రులు... అన్ని పాఠశాలల్లో ఇలా నిర్వహిస్తే పిల్లల్లో చదువుతో పాటు సభ్యత సంస్కారాలు నేర్పినట్లు అవుతుందంటున్నారు.