విద్యుత్ రంగంలో కేంద్రం కొత్తగా అమలుచేయతలపెట్టిన సంస్కరణలకు తెలంగాణ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు మరోమారు అభ్యంతరం వ్యక్తం చేశాయి. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను తాము ఆమోదించేది లేదని పునరుద్ఘాటించాయి. బుధవారం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కె.సింగ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ఇంధనశాఖ కార్యదర్శులు, విద్యుత్ సంస్థల సీఎండీలు పాల్గొన్నారు. తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ ప్రాంతాల రాష్ట్రాలతో విడివిడిగా సమావేశాలను నిర్వహించారు.
అసెంబ్లీలో తీర్మానం:
మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకూ నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల సమావేశంలో తెలంగాణ తరఫున స్థానిక విద్యుత్ సౌధ కేంద్ర కార్యాలయం నుంచి జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) సీఎండీ రఘుమారెడ్డి పాల్గొన్నారు. తొలుత కేంద్ర మంత్రి విద్యుత్‌రంగంలో సంస్కరణల ప్రయోజనాన్ని వివరించే ప్రయత్నం చేశారు. స్పందించిన సీఎండీలు.. ప్రైవేటీకరణను ఆది నుంచి తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. విద్యుత్ సంస్కరణలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని వివరించారు.
అవకాశం లేదు:
ఆర్పీవో (రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్) పేరిట ప్రతి రాష్ట్రం తప్పనిసరిగా సోలార్, నాన్‌సోలార్ విద్యుత్తును ఉత్పత్తిని చేపట్టాలని, లేనిపక్షంలో జరిమానాలు విధిస్తామని కేంద్రం తెలిపింది. ఈ నిబంధన ప్రకారం మొదటి ఏడాది యూనిట్‌కు 50 పైసలతో ప్రారంభించి, మరుసటి ఏడాది రూపాయి.. ఇలా జరిమానా పెంచుతూ వెళ్తారు. తెలంగాణలో పవన విద్యుత్తుకు అవకాశంలేదని చెప్పటంతో పాటు, పెనాల్టీ విధానాన్ని కూడా తెలంగాణ విద్యుత్ సంస్థలు వ్యతిరేకించాయి. ప్రధానంగా ఈ రెండు అంశాల కేంద్రంగానే సమావేశం సాగింది. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక మినహా మిగిలిన రాష్ట్రాలన్నీ విద్యుత్ సంస్కరణలను వ్యతిరేకించాయి.
రాష్ట్రాలతో చర్చించడంలో భాగంగా...
విద్యుత్ సవరణ బిల్లు 2021ను ఈ సారి బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టడానికి ముందు ఆయా రాష్ట్రాలతో చర్చించాలని కేంద్రం సంకల్పించింది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి ఈ ఆన్‌లైన్ కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ మంత్రిత్వశాఖ అనుసరిస్తున్న విధానం పారదర్శకంగా లేదని, ప్రధాన అంశాలను మరుగున పరచటానికే ఇదంతా చేస్తున్నట్టు ఉందని వివిధ ఉద్యోగ సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. వినియోగదారులతోపాటు, ఇతర భాగస్వామ్య పక్షాలందరితోనూ చర్చించాలని కోరుతున్నాయి. ముసాయిదాను ఆన్‌లైన్‌లో ఉంచి కనీసం మూడు నెలలపాటు అభిప్రాయాలు స్వీకరించాలని కోరుతున్నాయి.
ఇదీ చూడండి: న్యాయవాద దంపతుల హత్యకు... వాధించిన కేసులే కారణమా?