మాజీ పార్లమెంటు సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ నేత నంది ఎల్లయ్య కొవిడ్ బారిన పడి మృతి చెందడంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. నంది ఎల్లయ్య సోదరుడు నంది కృష్ణ పేరున ప్రత్యేకంగా సంతాప సందేశాన్ని పంపించారు. ఆరు సార్లు లోక్‌సభకు, రెండు మార్లు రాజ్యసభకు నంది ఎల్లయ్య ప్రాతినిథ్యం వహించారని వెంకయ్య గుర్తు చేశారు. మాజీ ఎంపీ, నంది ఎల్లయ్య వివాదరహితుడు, బడుగుల పక్షపాతని కొనియాడారు.
ఆయన జీవితం ఆదర్శనీయం...
ఎల్లయ్య రాజకీయ జీవితం ఆదర్శనీయమని... అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేశారని ప్రశంసించారు. నిబద్ధత, చిత్తశుద్ధితో ముందుకెళ్లిన నంది ఎల్లయ్య... ప్రస్తుత రాజకీయ నాయకులకు ఆదర్శనీయుడని కీర్తించారు.
ఆయన పాత్ర అనుసరణీయం
క్రమశిక్షణ కలిగిన ప్రజాప్రతినిధిగా చట్టసభల్లో ఆయన పోషించిన పాత్ర అనుసరణీయమన్నారు. దివంగత మాజీ ఎంపీ కుటుంబానికి, రాష్ట్ర ప్రజలకు ఆయన లేని లోటు తీర్చలేనిదని వెంకయ్య అన్నారు.
ఎల్లయ్య ఆత్మకు శాంతి చేకూరాలి...
ఎల్లయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నట్లు వెంకయ్య పేర్కొన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.