Hyderabad- Vijayawada NH: తెలుగు రాష్ట్రాలకు వారధిగా ఉన్న హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి ఎక్స్‌ప్రెస్ వే గా విస్తరణ జరిగి.. దశాబ్దం అవుతున్నా బాలారిష్టాలు తొలగలేదు. ఈ రోడ్డుపై ప్రమాదాలతో ఏటా పెద్ద సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు 2007లో ఈ రహదారి విస్తరణకు నిర్ణయించారు. పనుల కాంట్రాక్టు పొందిన జీఎమ్మార్ సంస్థ దీన్ని నిర్మించి.. 2012 అక్టోబరులో వినియోగంలోకి తెచ్చింది. రాజకీయ ఒత్తిళ్లతో పలు ప్రాంతాల్లో నిర్మాణం లోపభూయిష్టంగా సాగింది. తగినన్ని అండర్‌పాస్‌లు, ఫ్లై ఓవర్లు నిర్మించకపోవటంతో తరచూ ప్రాణనష్టం సంభవిస్తోంది.
పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడో.. ఆగ్రహంతో ప్రజలు ఉద్యమించినప్పుడో మాత్రమే అధికారులు నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. శాశ్వత పరిష్కారాల కోసం ప్రయత్నించడంలేదు. నల్గొండ, భువనగిరి లోక్‌సభ సభ్యులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తరచూ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీని కలిసి రహదారి దుస్థితిని వివరిస్తున్నారు. రెండు రాష్ట్రాల ఎంపీలతో కేంద్ర మంత్రి సమీక్ష సమావేశాలు నిర్వహించినా దిద్దుబాటు చర్యలకు ముందడుగు పడలేదు.
అండర్‌పాస్‌ల అవసరం ఇక్కడే..: చౌటుప్పల్, అంకిరెడ్డిగూడెం చౌరస్తా, పెద్దకాపర్తి, చిట్యాల బస్టాండు, నల్గొండ క్రాస్‌రోడ్డు, చందంపల్లి క్రాస్‌రోడ్డు, కట్టకొమ్ముగూడెం క్రాస్‌రోడ్డు, టేకుమట్ల, ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో, జనగాం క్రాస్‌రోడ్డు, సూర్యాపేట శివారు, ముకుందపట్నం, కొమరబండ క్రాస్‌రోడ్డు, కోదాడ బైపాస్, రామాపురం క్రాస్‌రోడ్డు తరచూ ప్రమాదాలు జరిగే మునగాల మండలం మొద్దులచెరువు ప్రాంతాన్ని బ్లాక్‌స్పాట్‌గా గుర్తించి తాత్కాలిక చర్యలతో సరిపెట్టారు. శాశ్వత నివారణ చేపట్టాలి.
సర్వీసు రోడ్లు లేక.. గాల్లో ప్రాణాలు: నకిరేకల్ వద్ద 2 కిలోమీటర్ల మేర భూసేకరణ చేసినా, సర్వీసురోడ్డు నిర్మించలేదు. దీనికోసం భేచందంపల్లి, గొల్లగూడెం, అడవిబొల్లారం, పెర్కబాయిగూడెం, భూపతికుంట, మాణిక్యాలగూడెం గ్రామాల ప్రజలు మూడేళ్లుగా పోరాడుతున్నారు. మునగాలలోని ప్రభుత్వ వైద్యశాల సమీపంలో సర్వీసు రోడ్డు అసంపూర్తిగా ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. చౌటుప్పల్‌లో ఏడాది కిందట చెరువు అలుగు పారటంతో సర్వీసు రోడ్డును పలు ప్రాంతాల్లో తవ్వి వదిలేశారు. కట్టంగూరు, తిప్పర్తి ఫ్లైఓవర్, ఇనుపాముల, ఆకుపాముల బైపాస్‌రోడ్డు, కేకే గూడెం క్రాస్‌రోడ్డు, మేళ్లచెరువు ఫ్లైఓవర్, నల్లబండగూడెం, నవాబ్‌పేట సమీపాల్లో సర్వీసు రోడ్లు తప్పనిసరి. ఇవన్నీ అర కిలోమీటరు నుంచి రెండు కిలోమీటర్ల పొడవుకు మించవు. మరోవైపు హైదరాబాద్ శివారునున్న మల్కారం నుంచి తెలంగాణ సరిహద్దు వరకు పలు ప్రాంతాల్లో వీయూపీ (వెహికల్ అండర్ పాస్)లు నిర్మిస్తే ప్రమాదాలను చాలావరకు నివారించవచ్చు.
'పోరాటం చేస్తున్నాం: 5 గ్రామాలకు చెందిన వందలాది మంది నిత్యం పనుల కోసం నకిరేకల్ వెళ్లాలి. రెండు కిలోమీటర్ల మేర జాతీయ రహదారిపైనే ప్రయాణిస్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. 2019 ఫిబ్రవరి 11న ఇద్దరు మరణించగా, సర్వీసు రోడ్డు వేయాలని జాతీయ రహదారిని దిగ్బంధించాం. నాతో (ఏ1) సహా 20 మందిపై పోలీసులు కేసులు పెట్టారు. ఇప్పటివరకు రోడ్డు వేయలేదు. నేను విదేశాలకు వెళ్లాలని పాస్‌పోర్టు రెన్యువల్‌కు ప్రయత్నిస్తే కేసుందని తిరస్కరించారు.' -నూకల రఘునందన్‌రెడ్డి, మాజీ సర్పంచి, చందంపల్లి, నకిరేకల్
'ఇల్లు కూలిపోతున్నా పట్టించుకోవట్లేదు: ఇనుపాముల వద్ద జాతీయ రహదారి పక్కనే మా ఇల్లు. అందులోనే కిరాణా దుకాణంతో జీవిస్తున్నాం. ఇక్కడ అండర్‌పాస్ కట్టడంతో పక్కనున్న చెరువు అలుగు పారినప్పుడు నడుం లోతు నీళ్లు నిలిచిపోతున్నాయి. దానివల్ల మా ఇంటి కింద మట్టి కొట్టుకుపోయి కూలిపోయే స్థితికి చేరింది. జీఎమ్మార్ వాళ్లు తాత్కాలికంగా ఇసుక, సిమెంటు బస్తాలతో అడ్డం పెట్టారు. పూర్తిగా రక్షణగోడ కడతామన్నారు. అంతవరకు వేరే చోట ఉండమంటే కిరాయి ఇంట్లోకి వెళ్లాం. ఆరు నెలలైనా రక్షణగోడ నిర్మించలేదు. అద్దె ఇంటి వాళ్లు ఖాళీ చేయమంటే మళ్లీ ఇక్కడికే వచ్చాం. వర్షాలొస్తే, ఇల్లు ఏమవుతుందో తెలియదు. గోడలు కూడా నెర్రెలిచ్చాయి.' - గంజి జయశంకర్, ఇనుపాముల, కేతేపల్లి
'నా భర్త, కుమారుడు దూరమయ్యారు: నేను, భర్త, ఇద్దరు పిల్లలం మోటారుసైకిలుపై గుడికి వెళ్లి వస్తున్నాం. ముందు వెళ్తున్న వాహనం ఒక్కసారిగా ఆగడంతో మా బైక్ ఢీకొని పెద్ద ప్రమాదం జరిగింది. నా భర్త, చిన్న కుమారుడు అక్కడే చనిపోయారు. నేను, పెద్ద కొడుకు స్పృహ కోల్పోయాం. విజయవాడ నుంచి కారులో వెళుతున్న పరిగి ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి కుమారుడు వర్షిత్‌రెడ్డి మమ్మల్ని హైదరాబాద్ కామినేని ఆసుపత్రిలో చేర్చారు. నెల రోజులకు కోలుకున్నాం. రూ.8 లక్షలకుపైగా బిల్లును ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెల్లించారు. మా కుటుంబానికి రూ. లక్షన్నర వరకు సాయం చేశారు. వారిద్దరి వల్ల నేను, నా కుమారుడు బతికాం. గ్రామ పెద్దలు, సద్గమయి మహిళా ఛారిటబుల్ సొసైటీ ఉద్యోగులు ఆర్థికసాయం చేశారు. సొసైటీలో నాకు పనిఇచ్చారు. దాంతోనే బతుకుతున్నాం.' - డాకోజి లక్ష్మి, లక్కారం, చౌటుప్పల్
ఇవీ చదవండి: రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట.. బాండ్ల విక్రయం ద్వారా రూ.4,000 కోట్ల రుణ సమీకరణకు కేంద్రం ఓకే!
గాయంతో జ్వెరెవ్ నిష్క్రమణ.. 14వ సారి ఫైనల్లో నాదల్.. అయినా బాధలోనే..