Police Training For Inter Students : పోలీస్ కానిస్టేబుల్ కొలువుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ఎంపిక చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని ఇంటర్ విద్యాశాఖ యోచిస్తోంది. ప్రతి జిల్లాలో కనీసం ఒక ప్రభుత్వ కళాశాలలో ఈ శిక్షణ ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. ఇంటర్ పరీక్షలు మే 6న ప్రారంభమై 24న ముగుస్తాయి. అంటే అప్పటి వరకు శిక్షణ ప్రారంభించడానికి వీలుకాని పరిస్థితి.
ఉచిత శిక్షణ అవసరం..
Police Training in Inter Colleges : అభ్యర్థుల నుంచి వచ్చే డిమాండ్‌తోపాటు అవకాశాలను పరిశీలించి ప్రభుత్వ అనుమతితో శిక్షణ ఇస్తామని ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ అన్నారు. పరీక్షలు ఉన్నందున అవి పూర్తయ్యాక శిక్షణ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరో ఉన్నతాధికారి మాట్లాడుతూ 'రాష్ట్రంలోని 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1.96 లక్షల మంది విద్యార్థులున్నారు. అందులో 90 శాతం వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన పేద కుటుంబాల వారే. అందుకే ఆ విద్యార్థులు ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లపై ఆధారపడకుండా ఉచితంగా కళాశాలల్లో శిక్షణ ఇవ్వడం అవసరం' అని అభిప్రాయపడ్డారు.
రెండేళ్ల క్రితం ఆలోచన..
ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్ రెండో సంవత్సరం చదివే విద్యార్థులకు వివిధ ఉద్యోగ పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వాలని రెండు సంవత్సరాల క్రితం అధికారులు ఆలోచన చేశారు. ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ జలీల్ 2020 నవంబరులోనే రాష్ట్రంలోని 14 కళాశాలల్లో పోలీసు కొలువులకు శిక్షణ ఇప్పించారు. అయితే నోటిఫికేషన్ రాకపోవడం, ఇంటర్ పరీక్షలు రావడంతో అర్ధంతరంగా శిక్షణను నిలిపివేశారు.
- ఇదీ చదవండి : బీటెక్ కనీస ఫీజు రూ.75 వేలుగా నిర్ధరణ