Revanth reddy on KCR: రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారులపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. వందలాది ఆత్మబలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణలో.. స్థానిక అధికారులకు కీలక బాధ్యతలు దక్కడం లేదని ఆరోపించారు. బిహార్‌కు చెందిన ఐఏఎస్ అధికారులకు కీలక పదవులు అప్పగిస్తున్నారని ఆరోపించారు. సీఎస్, డీజీపీ పోస్టులనూ వారికే కట్టబెట్టారని విమర్శించారు. సీఎస్ సోమేశ్‌కుమార్, ఇంఛార్జీ డీజీపీ అంజనీకుమార్, సీనియర్ ఐఏఎస్ అధికారులు జయేశ్ రంజన్, అర్వింద్ కుమార్, రజత్‌కుమార్, సందీప్‌కుమార్ సుల్తానియా, వికాస్‌రాజ్‌కు మూడు నుంచి ఆరు శాఖలను కట్టబెట్టారని ఆరోపించారు. బిహార్ ఐఏఎస్‌లను రక్షణ వలయంగా చేసుకొని పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. ఫలితంగా తెలంగాణ ప్రాంత అధికారులు పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారిందన్నారు.
సీఎస్ సోమేశ్ కుమార్ తీరుతో ధరణి లోపభూయిష్టంగా మారిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ధరణి పోర్టల్‌ను అడ్డంపెట్టుకొని.. అవుటర్ రింగ్‌రోడ్ చుట్టూ లక్షలాది ఎకరాల భూమి గోల్మాల్ అయింది. బిహార్ ఐఏఎస్ కారణంగా తెలంగాణ సమాజం ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆరోపించారు. ధరణి పోర్టల్ వల్ల భూతగాదాలు వస్తున్నాయని.. అవి కాస్త హత్యలకు కారణమవుతున్నాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. నిన్న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన స్థిరాస్తి వ్యాపారుల హత్యలు.. ధరణి లోపాల వల్లే జరిగాయని ఆరోపించారు.
సీఎం కేసీఆర్‌ను అడుగుతున్నా.. మీ పూర్వీకులు బిహార్ కావొచ్చు.. పరిపాలన మొత్తం వారిచేతిలో పెడతారా..?. రాష్ట్రంంలోని 157 మంది ఐఏఎస్‌లలో కేవలం బిహార్ ఐఏఎస్‌లే ప్రతిభావంతులా.? సీఎస్ సోమేశ్ కుమార్ సీనియారిటీ ప్రకారం.. ప్రిన్సిపల్ సెక్రటరీకే పరిమితం.. కానీ సీఎస్‌గా బాధ్యతలు ఇచ్చారు. జయేశ్ రంజన్, అరవింద్ కుమార్, సందీప్‌కుమార్ సుల్తానియా, రజత్‌కుమార్, వికాస్‌రాజ్.. వీరందరూ బిహార్‌కు చెందిన ఐఏఎస్ అధికారులు.. ఒక ముఠాగా ఏర్పడి.. కేసీఆర్ అక్రమాలకు సహకరిస్తున్నారు.
- రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్న రజత్‌కుమార్.. సార్వత్రిక ఎన్నికల్లో అవకతవకలకు సహకరించినందుకు.. జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శిగా నియమించారు. గ్రేటర్ ఎన్నికల్లో 30 లక్షల ఓట్లను సోమేశ్‌కుమార్ తొలగించారు. అందుకు నజరానాగా సీఎస్ పోస్ట్ ఇచ్చారు. పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి అర్వింద్‌కుమార్‌కు ఆరు శాఖలు ఇచ్చారు. డీజీపీగా ఉన్న మహేందర్‌రెడ్డిని సెలవుపై పంపించి... బిహార్‌కు చెందిన అంజనీకుమార్‌కు ఇంఛార్జి బాధ్యతలు అప్పగించారు.
- రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
తాను ఇవన్నీ బయటపెడితే.. రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సింది పోయి.. బిహార్ మంత్రి తనను విమర్శిస్తున్నారని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇప్పటికైనా తెలంగాణకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మాట్లాడారని కోరారు.
ఇదీచూడండి: పక్కాప్లాన్.. పాయింట్ బ్లాంక్ రేంజ్లో ఫైరింగ్.. హైదరాబాద్ రియల్టీల హత్యకేసులో విస్తుపోయే నిజాలు