పంజాబ్ హరియాణా హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. సహజీవనం చేస్తున్న జంటకు భద్రత కల్పించాలని తీర్పునిచ్చింది. వయోజనులైన ఇద్దరు వ్యక్తులు సహజీవనం చేయడంలో తప్పేమీ లేదని స్పష్టం చేసింది. తమకు రక్షణ కల్పించాలంటూ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న ఓ జంట కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఈ విధమైన తీర్పును ఇచ్చింది.
పంజాబ్‌కు చెందిన ఓ జంట సహజీవనం చేస్తున్నారు. అయితే రిలేషిప్‌లో ఉన్న యువకుడికి అప్పటికే వివాహం జరిగి విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు. విడాకులు మంజూరు కాకుండానే మరో మహిళతో సహజీవనం చేయడంపై.. అతడి భార్య, ఆమె తరఫు కుటుంబీకులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అతడిపై బెదిరింపులకూ పాల్పడటంతో తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఈ జంట పంజాబ్ హైకోర్టును ఆశ్రయించింది.
తమ క్లయింట్‌కు ఇప్పటికే వివాహం కాగా విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. విడాకుల వ్యవహారం కూడా దాదాపు పూర్తి అయిందని.. అందువల్ల తనకు నచ్చిన మరో యువతితో సహజీవనం చేస్తున్నాడని వివరించారు.
విచారణ చేపట్టిన ధర్మాసనం.. 2018లో ఐపీసీ సెక్షన్ 497 (వివాహేతర సంబంధం నేరం అని చెప్పే సెక్షన్ )ను రద్దుచేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించింది. బాధితులకు రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీచేసింది. అనంతరం విచారణను సెప్టెంబరు 24కు వాయిదా వేసింది.
"పిటిషన్‌దారులు ఎలాంటి నేరానికి పాల్పడ్డట్లు కనిపించడం లేదు. వయోజనులైన ఆ ఇద్దరు సహజీవనంలో ఉన్నారు. ఆ వ్యక్తి భార్యతో విడాకుల పిటిషన్ కోర్టులో పెండింగ్‌లో ఉన్నా, లేకపోయినా.. ప్రస్తుత పిటిషన్‌కు, దానికి సంబంధం లేదు."
-హైకోర్టు.
మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్న ఓ వివాహిత తనకు రక్షణ కల్పించాలని ఇటీవల ఇదే కోర్టును ఆశ్రయించగా.. అందుకు నిరాకరించడం గమనార్హం.
ఇదీ చూడండి: Live Murder: వంతెనపై కిరాతకంగా హత్య చేశారు