Vaddera Basti incident : హైదరాబాద్ మాదాపూర్‌లో కలకలం రేపిన కలుషిత జలం ఘటనలో బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గుట్టల బేగంపేటలోని వడ్డెర బస్తీలో నిన్నటి వరకు 57 మంది ఆసుపత్రి పాలవగా మరో 19 మంది అస్వస్థతకు గురైనట్లు స్థానికులు తెలిపారు. కలుషిత నీటివల్లే అస్వస్థతకు గురైనట్లు కాలనీవాసులు వెల్లడించారు. జ్వరం, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి లక్షణాలతో కొండాపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జనరల్ వార్డులో 42 మంది, చిల్డ్రన్ వార్డులో 34 మందికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విషమంగా ఉన్న ముగ్గురిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
Sickness Due to Water Pollution : మరోవైపు... కలుషిత నీరు తాగడం వల్లనే బస్తీలోని భీమయ్య అనే వ్యక్తి మృతి చెందాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజులుగా తాగునీరు దుర్వాసన వస్తోందని... జలమండలి సిబ్బంది చెప్పినా పట్టించుకోలేదని బాధితులు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఓ వ్యక్తి ప్రాణం పోయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పుడు 76 మంది ప్రాణాలతో కొట్టామిట్టాడుతున్నారని ఆవేదన చెందుతున్నారు.