గాంధీ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గాంధీభవన్ నుంచి కోఠి డీఎంఈ కార్యాలయం వరకు నర్సులు చేపట్టిన ర్యాలీని పోలీసులు ఆదిలోనే అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులకు నర్సులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. 20 మంది నర్సులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో పలువురు నర్సులకు గాయాలయ్యాయి. మమత అనే నర్సుకు కడుపులో దెబ్బ తగలగా... తీవ్రంగా నొప్పి రావటంతో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునితారావు తన కారులో ఆస్పత్రికి తీసుకెళ్లారు.
నర్సుల ఆందోళనకు మహిళా కాంగ్రెస్ నేతలు మద్దతు తెలిపారు. విధుల నుంచి తొలగించిన నర్సులను వెంటనే తీసుకోవాలని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునితారావు డిమాండ్ చేశారు.
ఏం తప్పు చేశామని ఇంత దౌర్జన్యం..
"మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలని శాంతియుతంగా ర్యాలీ చేపట్టినం. ఇది తప్పా. ఇంత దౌర్జన్యంగా అరెస్ట్ చేస్తారా..? మేం ఏం తప్పు చేశారని మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలని అడగటం కూడా తప్పేనా..? మా బాధను నిరసన రూపంలో తెలియజేస్తున్నాం. అది కూడా చేయనివ్వట్లేదు. మేం ఎవ్వరికీ హాని కలగకుండా మా బాధను తెలియజేస్తుంటే.. పోలీసులు మా పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారు. అమ్మాయిలు అని కూడా చూడకుండా ఇష్టమొచ్చినట్టు కొడుతూ లాక్కెళ్తున్నారు. మాలో ఒక అమ్మాయిని కడుపులో కొట్టారు. ఇప్పుడు ఆ అమ్మాయి నొప్పితో బాధపడుతుంది. ఆ అమ్మాయికి ఏమన్నా అయితే ఎవరు బాధ్యులు...?"- బాధిత నర్సులు
నర్సులను కొట్టటం అన్యాయం..
"నర్సులకు మా పూర్తి మద్దతు తెలుపుతున్నాం. వారి జీతాలు వెంటనే చెల్లించి.. వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నదే మా డిమాండ్. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నర్సుల పట్ల పోలీసులు ఇంత దౌర్జన్యంగా ప్రవర్తించటం అన్యాయం. నర్సులపై పోలీసులు చేయిచేసుకోవటాన్ని మహిళా కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోంది."
- సునితారావు, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు
గాంధీభవన్ ప్రవేశద్వారం వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. గేట్లకు అడ్డంగా బారీకెడ్లు ఉంచి నర్సులను అడ్డుకున్నారు. ఇప్పటికే పలువురు నర్సులను అరెస్ట్ చేసిన పోలీసులు.. నారాయణగూడ ఠాణాకు తరలించారు.