రాష్ట్ర ఉద్యోగులకు కొత్త సేవా నిబంధనలు రూపుదిద్దుకుంటున్నాయి. తొలి వేతన సవరణ సంఘానికి ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. అన్ని శాఖల ఉద్యోగులకు కొత్త సర్వీసు రూల్స్ రూపకల్పన కోసం సిఫార్సులు చేయాలని సూచించింది. పాలనా సంస్కరణలు, జవాబుదారీతనం పెంపుదల, కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, నగరపాలికలు, పురపాలక సంస్థలకు అనుగుణంగా సిబ్బంది సంఖ్య పెంపు, పోస్టులకు కొత్త పేర్లు పెట్టడానికి సూచనలు ఇవ్వాలని ఆదేశించింది.
కొత్త పీఆర్‌సీ.. కొత్త సేవా నిబంధనలు
సేవానిబంధనలకు రూపమిచ్చే బాధ్యతలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులకు లేదా వారి ఆధ్వర్యంలోని కమిటీలకు ప్రభుత్వం అప్పగించింది. తాజాగా తెలంగాణలో కొత్త పీఆర్‌సీపై కసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో సేవా నిబంధనల తయారీని సైతం దానికి అనుసంధానిస్తూ సర్కార్ మార్గదర్శకాలు ఇచ్చింది.
అన్ని శాఖల అధిపతులకు లేఖ
పీఆర్‌సీ అన్ని శాఖల అధిపతుల నుంచి సమాచారాన్ని కోరుతూ లేఖ రాసింది. జిల్లాల సంఖ్య 33కి పెరిగినందున కలెక్టరేట్లు, జిల్లా కార్యాలయాల్లో జనాభా, ఇతర అవసరాలకు అనుగుణంగా సిబ్బంది సంఖ్య ఖరారు చేయడం, పరిపాలన మెరుగుపరచడం, యంత్రాంగంలో జవాబుదారీతనాన్ని తేవడం అంశాలకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలను సూచించాలని పీఆర్‌సీని ప్రభుత్వం ఆదేశించింది.
పీఆర్‌సీ మార్గదర్శకాలు
- అన్నిశాఖలు సేవా, ప్రత్యేక, తాత్కాలిక నిబంధనలు, వాటిలో మార్పుల గురించి జారీచేసిన ఉత్తర్వులు
- ప్రతీ శాఖలో రాష్ట్ర, ప్రాంతీయ, డివిజన్, మండల స్థాయి ఉద్యోగ వ్యవస్థ
- 33 జిల్లాల్లో ఉద్యోగుల సంఖ్య, ఖాళీలు
- జిల్లాలు, మండల స్థాయుల్లో అవసరమైన సిబ్బంది, వారి పోస్టులకు కొత్త పేర్లు
- ప్రతి విభాగంలో, వివిధ స్థాయుల్లో ఉద్యోగుల కొనసాగింపు అవసరాలు
- ప్రత్యక్ష నియామకాలు, పదోన్నతుల శాతాలు
- ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగుల సంఖ్య
- అమల్లో ఉన్న బాధ్యతలు, జవాబుదారీతనం తీరుతెన్నులు, వాటి మెరుగుకు అవసరమైన చర్యలసూచన
- శాఖల వారీగా శిక్షణ సంస్థలు, వాటిలో వివిధ స్థాయి ఉద్యోగులకు తర్ఫీదు తీరుతెన్నులు.
- గత ఏడాది మే 18న పీఆర్‌సీ ఏర్పాటైంది. ఇప్పటివరకు నివేదిక ఇవ్వలేదు. రెండింటి అనుసంధానం పూర్తయ్యాకే కొత్త పీఆర్‌సీ ఖరారు కానుంది.