రెండేళ్ల నుంచి తెలంగాణలోని మహిళలు తమ సమస్యలు ఎవరితో మొరపెట్టుకోవాలో తెలియని అయోమయస్థితిలో ఉన్నారని తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. దీనికి కారణం తెలంగాణలో మహిళా కమిషన్ లేకపోవడమేనని తెలిపారు. ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. సమస్యలను పట్టించుకోకుండా ప్రజలను మోసగిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ తెదేపా తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో లక్డీకపూల్‌లోని ఓ ప్రైవేటు హోటల్లో నిర్వహించిన... "తెలంగాణ మహిళా కమిషన్ - ఆవశ్యకత - ఏర్పాటు" పై రౌండ్ టేబుల్ సమావేశంలో ఎల్.రమణ పాల్గొన్నారు.
మహిళల సమస్యలను కూలంకషంగా పరిశీలించి.. చట్టాల్లో ఎటువంటి మార్పులు చేయాలో తెలియజేయడానికి మహిళా కమిషన్ అవసరమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళుతోందని ప్రగల్భాలు పలుకుతూనే... మహిళల మీద జరుగుతున్న హింసను పట్టించుకోకుండా జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. కమిషన్ ఏర్పాటు కోసం వారు చేస్తున్న పోరాటానికి తమ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని రమణ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో భాజపా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతా మూర్తి, పలు మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు.