నాకు వంటింటి చిట్కా బాగా పనిచేసింది
కొవిడ్-19 విపత్కర పరిస్థితుల్లో వలస కూలీలు, లాక్‌డౌన్ అమలు కోసం మేమంతా క్షేత్ర స్థాయిలో పనిచేశాం. విధుల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మాకూ వైరస్ సోకింది. ఇలాంటి సమయంలో ఎంత ధైర్యంగా ఉంటే అంత త్వరగా కోలుకోవచ్చు. దాన్నే నేను పాటించాను. ఎలాంటి లక్షణాలు లేకున్నా ఇంటికే పరిమితమయ్యాను. అక్కడి నుంచే నా బాధ్యతలు కూడా నిర్వర్తించాను. పోషకాహారం తీసుకున్నాను. ప్రతిరోజూ ఆవిరి పట్టేదాన్ని. వంటింటి చిట్కా (తులసి ఆకులు, పసుపు, మిరియాలు, అల్లం.. నీటిలో వేడిచేసిన మిశ్రమం) నా విషయంలో బాగా పనిచేసింది. కరోనా విషయంలో అంతగా భయపడాల్సిన పనిలేదు. ఓ సాధారణ ఫ్లూగా భావించండి. అలాగని నిర్లక్ష్యం చేయొద్దు.
- షికా గోయల్, అదనపు కమిషనర్, క్రైం
బీపీ, షుగర్ ఉన్నా కోలుకున్నా..
కొద్దిరోజుల క్రితమే జలుబుతో పాటు నీరసంగా అనిపించింది. పరీక్ష చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. అప్పటికే నాకు బీపీ, షుగర్ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇది మరింత ప్రమాదకరమని అనుకున్నాను. వైద్యుల సూచనతో డ్రైఫ్రూట్స్, పండ్లు, ప్రొటీన్లు ఎక్కువుండే ఆహారం తీసుకున్నాను. వ్యక్తిగత పరిశుభ్రతపై ఎక్కువ దృష్టిపెట్టాను. తక్కువ సమయంలోనే దాన్నుంచి కోలుకున్నాను. సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు. జాగ్రత్తలు పాటిస్తే మహమ్మారిని ఎదుర్కోవచ్చు. ఈనెల చివర్లోనే నా పదవీ విరమణ ఉంది. మళ్లీ విధుల్లో చేరబోతున్నాను.
- రత్న, ఏవో, ఇంటెలిజెన్స్ విభాగం
యోగా, మిత్రుల భరోసా గెలిపించింది
మే 20న కొన్ని లక్షణాలు కనిపించాయి. పరీక్ష చేయించుకుంటే పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇక భయం మొదలైంది. అదే సమయంలో తోటి సిబ్బంది, కమిషనర్ భరోసానిచ్చారు. సానుకూల దృక్పథమే దీనికి మందు అని చెప్పారు. ఇక గాంధీలో చేరిన నాటి నుంచి యోగా, మంచి ఆహారం, సీ విటమిన్ తీసుకోవడం మొదలుపెట్టాను. 14 రోజుల్లో పూర్తిగా కోలుకున్నాను. మరో 14 రోజులు ఇంట్లో క్వారంటైన్‌లో ఉండి ఇప్పుడు తిరిగి విధుల్లో చేరాను.
- సుధీర్‌కృష్ణ, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్, బాలాపూర్ స్టేషన్
ఇద్దరం ఇంట్లోనే ఉండి జాగ్రత్తలు తీసుకున్నాం
నేను పోలీస్ విభాగంలో ఉద్యోగిని. మా ఆయన ప్రభుత్వాసుపత్రిలో వైద్యుడు. సాధారణ పరీక్షల్లో భాగంగానే జూన్ 2న మేం పరీక్షలు చేయించుకున్నాం. పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అప్పటికి మాకు ఎలాంటి లక్షణాలు లేవు. అందరిలాగే మొదట భయపడ్డాం. మానసిక ధైర్యంతోపాటు రోగ నిరోధకశక్తి పెంచుకోవడమే మార్గమని మాకు తెలుసు కాబట్టి వెంటనే తమాయించుకుని ఆ పద్ధతిలో ముందుకెళ్లాం. ఇద్దరం ఇంటికే పరిమితమై సరైన ఆహార పద్ధతులు పాటించాం. తరచూ వేడినీళ్లు తాగేవాళ్లం. ఆయుర్వేదంలో చెప్పే మార్గాలన్నీ పాటించాం. ఆహారంలో ప్రొటీన్ అధికంగా ఉండే పదార్థాలు, మాంసం ఎక్కువ ఉండేలా చూసుకుని పూర్తిగా కోలుకున్నాం. మన కుటుంబాలకు మనమే భరోసానివ్వాలి కాబట్టి ధైర్యంగా ఉంటే కోలుకోవచ్చు.
- శ్రీదేవి, కమ్యూనికేషన్ ఇన్‌స్పెక్టర్, రాచకొండ కమిషనరేట్
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో మరోసారి లాక్‌డౌన్..!