లాక్‌డౌన్ కాలంలో వ్యాపారాలు నడవక, ఆర్థికంగా చితికిపోయిన వ్యాపారుల విషయంలో మానవీయ కోణంలో స్పందించాలని సర్కార్ నిర్ణయించిందని తెలిసింది. హైదరాబాద్ మహానగర పరిధిలో ప్రభుత్వ సంస్థలు, శాఖల ఆస్తులను వ్యాపారాలు చేసుకోవడానికి అద్దెకు తీసుకుంటే.. అయిదారు నెలల పాటు అద్దె/లీజును మినహాయించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దీనిపై రాష్ట్ర పురపాలక శాఖ అంతర్గతంగా కసరత్తు చేసింది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) అద్దె మినహాయింపు దస్త్రాన్ని ఉన్నతాధికారులకు పంపించడానికి సిద్ధం చేస్తోంది.
నగరంలో అనేక ప్రభుత్వ సంస్థల ఆస్తులను వాణిజ్య ప్రతిపాదికన అనేక మంది అద్దె/లీజు కింద తీసుకున్నారు. జీహెచ్‌ఎంసీతోపాటు హెచ్‌ఎండీఏ, దేవాదాయ శాఖ, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, వక్ఫ్ బోర్డు ఇలా అనేక సంస్థల ఆస్తులను వేల మంది అద్దెకు తీసుకున్నారు. అమీర్‌పేట దగ్గర హెచ్‌ఎండీఏకు మైత్రీవనం, స్వర్ణజయంతి పేరుతో అతి పెద్ద క్లాంపెక్సులు ఉన్నాయి. ఇదే సంస్థ హాకా భవనాన్ని కూడా అద్దెలకు ఇచ్చింది. నాంపల్లిలో గగన్‌విహార్, చంద్రవిహార్ పేరుతో మరికొన్ని అతి పెద్ద దుకాణ సముదాయాలూ వివిధ సంస్థలకు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీకి చిన్నా, పెద్దా రెండు వేల వరకు షాపులు ఉన్నాయి. వీటన్నింటిని అనేక ఏళ్ల కిందటే వేలంలో అద్దెలకు ఇచ్చారు. వాణిజ్య భవనాల లీజులు, వివిధ షాపుల అద్దెలతో అన్ని ప్రభుత్వ శాఖలకు, సంస్థలకు ఏడాదికి రూ.100 కోట్ల ఆదాయం సమకూరుతోందని అంచనా.
వ్యాపారుల కోరిక మేరకు..
అద్దె నుంచి వెసులుబాటు ఇవ్వాలని వ్యాపార సంస్థల ప్రతినిధుల విన్నపాల మేరకు మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మానవీయ కోణంలో వ్యాపార సంస్థలు, చిరు వ్యాపారులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్న భావనలో కేటీఆర్ ఉన్నారని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. ఇందులో భాగంగానే పురపాలక శాఖ కార్యాచరణ మొదలుపెట్టింది. తొలుత హెచ్‌ఎండీఏ స్పందించి ప్రతి షాపునకు 4 నెలల నుంచి 6 నెలల పాటు అద్దె/ లీజులను వసూలు చేయకూడదని నిర్ణయించినట్లు అధికారవర్గాలు తెలిపాయి.
- ఇదీ చూడండి : కొవాగ్జిన్ సమర్థతపై కేంద్రం కీలక ప్రకటన