Telangana Commercial Tax Revenue in August : తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఆగస్టు నెలలో అంచనాలకు మించి రాబడిని సాధించింది. రాష్ట్ర ప్రభుత్వం రూ. 6,000 కోట్ల ఆదాయాన్ని అంచనా వేయగా రూ. 6,446 కోట్లు వచ్చింది. ఇది గత ఏడాది ఆగస్టు రాబడితో పోలిస్తే 25 శాతం అధికం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు వరకు అమ్మకం పన్ను, జీఎస్టీ ఆదాయాన్ని వాణిజ్య పన్నుల శాఖ విశ్లేషించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి 5 నెలలకు గాను ఈ శాఖ ద్వారా ఖజానాకు రూ. 29,103 కోట్ల మేర సమకూరింది. గత ఏడాది మొదటి 5 నెలల ఆదాయం కంటే ఇది 17 శాతం ఎక్కువ కావడం గమనార్హం. పెట్రోలియం ఉత్పత్తులు, మద్యంపై అమ్మకం పన్నుతో పాటు ఎస్జీఎస్టీ, ఐజీఎస్టీ, జీఎస్టీ పరిహారం ద్వారా రాష్ట్రానికి ఈ ఏడాదికి గాను వేసిన అంచనా ఆదాయంలో 42 శాతం 5 నెలల్లో సమకూరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య పన్నుల శాఖ రాబడిని రూ. 69,203 కోట్లుగా అంచనా వేశారు.