సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం (Telangana Cabinet Meet) ముగిసింది. ధాన్యం కొనుగోళ్లు, యాసంగి సాగుపై చర్చించారు. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులు, ప్రజారోగ్యం, వైద్యారోగ్యశాఖ సన్నద్ధత, కార్యాచరణపై చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ టీకాల పురోగతి, మందుల లభ్యతపై మంత్రిమండలిలో చర్చ జరిగింది. ఆక్సిజన్ పడకల సామర్థ్యం, తదితర అంశాలపై కేబినెట్లో (Telangana Cabinet Meet) సమీక్షించారు.
కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, టీకా ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యల కోసం సబ్ కమిటీని నియమిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ సబ్ కమిటీకి వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి, సబితా ఇంద్రారెడ్డి ఉండనున్నారు. ఒమిక్రాన్ వేరియంట్‌పై ప్రస్తుత పరిస్థితిపై మంత్రివర్గానికి నివేదించిన అధికారులు... వైద్యశాఖ పూర్తి సన్నద్ధతతో ఉందని, అన్ని రకాల మందులు, పరికరాలు , మానవ వనరులు, పూర్తిగా అందుబాటులో ఉన్నాయని వివరించారు.
ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని, అందుకు మంత్రులందరూ వారి వారి జిల్లాల్లో సమీక్షించాలని, అవసరమైన వారందరికీ సత్వరమే టీకా ఇప్పించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆదిలాబాద్, కుమురంభీం నిర్మల్, మహబూబ్ నగర్, నారాయణ పేట, గద్వాల్ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కేబినెట్ స్పష్టం చేసింది. కరోనా పరీక్షలు ఎక్కువగా చేసేందుకు అవసరమైన సన్నద్ధత, ఆక్సిజన్ పడకల సామర్థ్యంపై అధికారులకు మంత్రివర్గం సూచనలిచ్చింది.
ఇదీ చదవండి : Kishan reddy comments on KCR: 'ధాన్యం కొనేదిలేదని కేంద్రం ఎప్పుడు, ఎలా చెప్పిందో నిరూపించండి'