Chandrababu on OTS: ఓటీఎస్ వసూళ్లు.. పేదల మెడకు ఉరితాళ్లుగా మారాయని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఉచిత రిజిస్ట్రేషన్ కోరుతూ ఈనెల 20న ఏపీలోని మండల, మున్సిపల్ కార్యాలయాలు, 23న కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసనలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ ముఖ్యనేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ హయాం నుంచి నిర్మించిన ఇళ్లకూ జగన్ రెడ్డి ఓటీఎస్ పేరుతో పేదల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నో ఏళ్లుగా అదే ఇళ్లల్లో పేదలు నివసిస్తున్నారని.. ఆ ఇళ్లు వారి సొంతమని చంద్రబాబు స్పష్టం చేశారు. పేదవారి జీవితాలతో ఆడుకుంటున్న జగన్ రెడ్డి తీరును తెదేపా నేతలు సమావేశంలో తీవ్రంగా ఖండించారు.
తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత రిజిస్ట్రేషన్లు..
Chandrababu on OTS: ఓటీఎస్ పథకం కింద పేదలెవరూ ప్రభుత్వానికి సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదని చంద్రబాబు అన్నారు. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా ఇళ్లు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుందని సమావేశంలో తీర్మానం చేశారు. తెలుగుదేశం హయాంలో విశాఖలో 52 వేల ఇళ్లను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేశామని గుర్తుచేశారు.
రాధాకృష్ణపై జీరో ఎఫ్ఐఆర్ దారుణం..
చిరకాల మిత్రుణ్ణి పరామర్శించిన రాధాకృష్ణపై జీరో ఎఫ్ఐఆర్ నమోదుచేయడం దారుణమని ధ్వజమెత్తారు. కక్షసాధింపు కోసమే స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టుపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. చెల్లింపులన్నీ ప్రేమ్ చంద్రారెడ్డి ఎండీగా ఉన్నప్పుడే జరిగాయని... ముందు అతన్నే ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే స్కిల్ డెవలప్మెంట్పై కేసునమోదు చేశారని ఆరోపించారు.
ధాన్యం కొనుగోలు చేసే వారు కరవయ్యారు..
ఏపీలో ధాన్యం కొనుగోలు చేసే వారు కరవయ్యారని, రైతులు.. ప్రైవేటు వ్యాపారులకు అమ్మడంతో.. బస్తాకు రూ.500 వరకు నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చే పరిస్థితి కూడా లేదన్నారు.
అమరావతిని నాశనం చేశారు..
అమరావతి రైతుల మహాపాదయాత్ర ముగింపు సభకు తెదేపా నేతలు సంఘీభావం తెలిపారు. రాజధాని విషయంలో అధికార పార్టీ నేతలు.. అప్పుడు ఒక మాట, ఇప్పుడు మరోమాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాడు.. 13 జిల్లాల చిన్న రాష్ట్రంలో చిచ్చు పెట్టడం ఇష్టం లేదని, నేడు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి చలికాచుకుంటున్నారని విమర్శించారు. ఈ విధంగా వ్యవహరించి.. రూ.2 లక్షల కోట్ల సంపదకు కేంద్రమైన అమరావతిని నాశనం చేశారని ధ్వజమెత్తారు. ప్రైవేటు లే-అవుట్లలో 5 శాతం భూమి నిబంధన ద్వారా.. మధ్యతరరగతిపై పెనుభారం మోపుతున్నారని బాబు మండిపడ్డారు.
ఇదీ చదవండి:
Harish rao on Health: హెల్త్ ఛాంపియన్గా తెలంగాణ అవతరించింది: హరీశ్ రావు