AP TDP leaders Protest: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెంకటపాలెంలో ఉన్న రెండు ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద తెదేపా శాసనసభ పక్షం నిరుద్యోగ సమస్యపై లోకేశ్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. 2.30లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ ఎక్కడా... అంటూ ప్లకార్డుల ప్రదర్శించారు. జాబ్ రావాలంటే... జగన్ పోవాలంటూ నినాదాలు చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి అసెంబ్లీకి కాలినడకన నిరసన ర్యాలీగా వెళ్లారు. ప్రతిపక్షంలో ఉండగా జగన్ జాబ్ క్యాలెండర్ అన్నారన్న నిమ్మలరామానాయుడు... అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ లేదని, ఉద్యోగాల భర్తీ లేదని విమర్శించారు. తెదేపా హయాంలో 7 డీఎస్సీలు వేశామని, చంద్రబాబు హయాంలో నిరుద్యోగ భృతి ఇచ్చామని గుర్తుచేశారు.
జాబ్ ఎక్కడా..జగన్ ఎక్కడ..అని అసెంబ్లీలో ప్రశ్నిస్తామని తెలిపారు. జాబ్ క్యాలెండర్ అని ప్రకటించిన ప్రభుత్వం జాబ్ లెస్ క్యాలెండరుగా మారిందని వాయిదా తీర్మానం ఇస్తున్నామని తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలిపారు. ప్రతేడాది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లేదని విమర్శించారు. పరిశ్రమలు, పెట్టుబడులు రాకపోవడం వల్ల ప్రైవేట్ రంగంలోనూ యువతకు నిరాశే ఎదురైందన్నారు. యువత నిర్వీర్యం, జాబ్ లెస్ క్యాలెండర్ అంశాలపై సభలో చర్చించాలని డిమాండ్ చేశారు.
ఉద్రిక్తత: అసెంబ్లీ సమీపంలో ఉద్రిక్తత నెలకొంది. 2.30లక్షల ఉద్యోగాల భర్తీ డిమాండ్ చేస్తూ... తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ నేతలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. వెలగపూడి చెక్ పోస్ట్ వద్ద శ్రీరామ్ చినబాబు, ఇతర నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, తెలుగు యువత శ్రేణులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పోలీసులు... తెలుగు యువత శ్రేణులను ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వాహనాల్లోకి ఎక్కించారు. పలువురు నేతలకు గాయాలయ్యాయి. తెలుగు యువత నాయకుల్ని అరెస్టుచేసి స్టేషన్కు తరలించారు.
ఇవీ చదవండి: