రాష్ట్రంలో కొవిడ్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నందున ఈ మహమ్మారి నుంచి ఉద్యోగులు, ఖాతాదారులను రక్షించేందుకు భారతీయ స్టేట్ బ్యాంకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఎస్బీఐ చీఫ్ జనరల్ మనేజర్ ఓం ప్రకాష్ మిశ్రా తెలిపారు. రద్దీగా ఉండే శాఖల వద్ద థర్మల్ స్కానర్లు, సిబ్బందికి పీపీఈ కిట్లు కూడా అందించామని ఆయన ఒక ప్రకటనలో వివరించారు. శాఖల వద్ద భౌతిక దూరం పాటించడం, అవసరమైన మేర శానిటైజర్లు ఉంచడం, మాస్క్‌లు అందించడంలాంటి అన్ని చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం, బ్యాంకు యాజమాన్యం ఇచ్చిన మార్గదర్శకాలను పూర్తి స్థాయిలో అనుసరిస్తున్నామని, అయినా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందన్నారు. అందువల్ల బ్యాంకు ఉద్యోగులు, వారి కుటుంబాలకు భరోసా కల్పించేట్లు కరోనా కట్టడికి వంద శాతం చర్యలు తీసుకున్నామని వివరించారు. ఖాతాదారులకు అన్ని రకాల బ్యాంకింగ్ సేవలు అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు.
కరోనా పాజిటివ్ కేసులతోపాటు, వివిధ ఆరోగ్య సమస్యల కారణంగా చాలా మంది ఉద్యోగులకు విధుల నుంచి మినహాయింపు ఇచ్చామని... ఆ ప్రభావం కొంత బ్యాంకు శాఖలపై ఉందని తెలిపారు. ఉద్యోగుల్లో కరోనా పాజిటివ్ వచ్చిన సందర్భాల్లో, శానిటైజేషన్ చేసేందుకు తమ శాఖలను మూసివేస్తున్నామని... ఇలాంటి సమయంలో సేవలు అందించలేకపోతున్నట్లు తెలిపారు. ఖాతాదారులు తప్పనిసరి అయ్యితేనే బ్యాంకులకు రావాలని, చిన్న చిన్న అవసరాల కోసం రానక్కర్లేదని స్పష్టం చేశారు.
ఖాతాదారుల కోసం
ఖాతాదారులు ఆరోగ్యాన్ని, వారి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని బ్యాంక్ యోనో అప్లికేషన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని, ఇతర సురక్షిత డిజిటల్ లావాదేవీలను ఇంటి నుంచే వాడుకోవాలన్నారు. డబ్బు తీసుకోడానికి ఏటీఎంలను వాడుకోవాలని, స్మార్ట్ ఫోన్లు లేని ఖాతాదారులు సైతం మిస్డ్ కాల్ సౌకర్యంతో బ్యాలెన్స్ తెలుసుకోవచ్చన్నారు. 09223488888 కు రిజిస్ట్రర్డు మొబైల్ నంబర్ నుంచి SMS 'REG <space> ఖాతా నంబర్' పంపడం ద్వారా నిల్వ మొత్తం ఎంత ఉందో తెలుసుకోవచ్చని వివరించారు. ఎస్బీఐ శాఖలకు నేరుగా రాకుండా అవకాశం ఉన్న మేరకు ఖాతాదారులు డిజిటిల్ లావాదేవీలు ఉపయోగించుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి : ఐసోలేషన్లో హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి