Revanth Reddy: ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. రెండు రోజుల క్రితం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో కాలుషితాహారం తిని 128 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఎన్‌ఎస్‌యూఐ నేతలు విద్యార్థులను పరామర్శించేందుకు సిద్దిపేటకు బయలుదేరారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేశారు. ఈ ఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు అస్వస్థతకు గురైతే వారిని పరామర్శించడానికి వెళ్తున్న విద్యార్థి నాయకుడిని అడ్డుకోవడం తెరాస పాలకుల పాశవికత్వం అని విమర్శించారు.
రాష్ట్రంలో పోలీసుల పాలన సాగుతోందని, ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు స్పందించేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా అణచివేస్తున్నారన్నారు. మానవత్వం లేకుండా వెంకట్ పైన పోలీసులు దాడి చేశారన్నారు. పాలకులు ఇలాగే పాశవికంగా ప్రవర్తిస్తే తగిన గుణపాఠం చెపుతామన్నారు. తెరాస పాలకులకు రోజులు దగ్గర పడ్డాయని రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ ఘటనలో వెంకట్ గాయపడడంతో కాంగ్రెస్ నాయకులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రేవంత్‌రెడ్డి సిద్దిపేట పోలీస్ కమీషనర్‌తో ఫోన్‌లో మాట్లాడారు.
ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు వెంకట్‌పై పోలీసుల అరాచకం నియంతృత్వ పోకడకు నిదర్శనమని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి విమర్శించారు. పోలీసుల దాడిలో సృహ తప్పిపోయిన వెంకట్‌కు ఎలాంటి సమస్య ఎదురైనా తెరాస ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక, నియంత పోకడలకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెపుతారని మల్లురవి హెచ్చరించారు. సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెంకట్‌ను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పరామర్శించారు. విద్యార్థుల పరామర్శకు వెళ్తున్న వెంకట్‌ను పోలీసులు అడ్డుకోవడం దారుణమని ఆయన ఆరోపించారు.
ఇవీ చదవండి: