Godavari water flow: కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి వరద పోటెత్తింది. ధవళేశ్వరం వద్ద నదిలోకి నీటి ప్రవాహం భారీగా పెరిగింది. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు సముద్రంలోకి 13 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భారీ వరదతో బ్యారేజీకి దిగువనున్న లంక గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గోదావరి ఉద్ధృతితో కోనసీమ జిల్లాలోని చాకలిపాలెం సమీపంలో కనకాయలంక వద్ద కాజు వే ముంపునకు గురైంది. గ్రామ ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. బూరుగులంక, అరిగెలవారి పేట, ఉడుముడి లంక, జి.పెదపూడి లంక , అయోధ్య లంక, ఆనగారిలంక , పెదమల్లంకకు రాకపోకలు నిలిచిపోయాయి. పడవలపై ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.
ముమ్మిడివరం, ఐ పోలవరం మండలాల్లో గోదావరి పాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ముమ్మిడివరం పరిధిలోని లంకా ఆఫ్ ఠాన్నే లంక, పల్లం వారిపాలెం గ్రామాల్లో మెట్ట పంటలు నీటి మునిగాయి. మునగ, గోంగూర, బీర, అరటి తోటలు ముంపు బారిన పడ్డాయి. కొబ్బరి తోటలోని కాయలు కొట్టుకుపోకుండా రైతులు గట్టుకు చేరుస్తున్నారు. ఐ.పోలవరం మండలం ఎదురులంకలో వరదకు కొబ్బరి చెట్లు పడిపోతున్నాయి.కాకినాడ జిల్లాపైనా వరద ప్రభావం పడింది. పలుచోట్ల వాగుల ఉద్ధృతి పెరిగింది. యానాంలో రాజీవ్ గాంధీ బీచ్‌కు అనుకుని ఉన్న కాలనీలోకి వరద నీరు చేరింది. అధికారులు మోటార్లతో నీటిని తోడుతున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలోని తోటపల్లి జలాశయం గట్టు ప్రమాదకరంగా మారింది. వర్షాలకు భారీగా వరద నీరు జలాశయంలోకి చేరుతోంది. ఎగువ నుంచి 5 వేల 654క్యూసెక్‌ల వరద ప్రాజెక్ట్ లోకి వస్తోంది. రెండు గేట్లు ఎత్తి నీటిని అధికారులు దిగువకు వదలుతున్నారు. అయితే.. స్పిల్ వే గేట్ల కుడివైపు గట్టు ప్రమాదకరంగా మారింది. ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదలతో క్రమంగా కోతకు గురవుతోంది. అధికారులు ప్రస్తుతం ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. గట్టు కోతకు గురవడంపై స్థానికులు కలవరపడుతున్నారు. వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలంలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. వర్షపు నీటితో కొండ వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ముసురుమిల్లి, భూపతిపాలెం జలాశయాలు నీటితో నిండాయి. చింతూరు నుంచి భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న శబరి వంతెన వరకూ నీరు చేరింది. కూన వరం వద్ద ప్రధాన రహదారిపై.. గోదావరి నీరు చేరడంతో.. రాకపోకలు స్తంభించాయి. చింతూరు, కూనవరం మండలాల్లో వరద సహాయక పనులను ఎమ్మెల్యే ధనలక్ష్మి, కలెక్టర్ సుమిత్ కుమార్, జేసీ సూరజ్ పరిశీలించారు
రాష్ట్రంలో వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విపత్తు బృందాలను ఎక్కడికక్కడ మోహరించాలని ఆదేశించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రాజస్థాన్ జైసల్మేర్ వరకు క్రియాశీలకంగా నైరుతి రుతుపవనాల ద్రోణి కొనసాగుతోంది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రాగల రెండ్రోజులపాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు సూచించింది.
ఇదీ చదవండి: మత్తడి దూకుతున్న భద్రకాళీ చెరువులో చేపల వేట.. క్యూకట్టిన స్థానికులు