తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నరసరావుపేట పర్యటన ఉత్కంఠగా మారింది. పర్యటన కోసం గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన లోకేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పర్యటనకు అనుమతి లేకపోవడంతో లోకేశ్‌ను అడ్డుకున్నారు. పోలీసుల అదుపులో లోకేశ్‌తో పాటు పలువురు తెదేపా నేతలు ఉన్నారు. వారిని ఎక్కడికి తరలించేది పోలీసులు గోప్యంగా ఉంచారు.
నా పర్యటనను ఎందుకు అడ్డుకుంటున్నారో తెలియట్లేదు. నేను ధర్నాలు, ఆందోళనలు చేయడానికి వెళ్లట్లేదు. ఒక కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్నా. కుటుంబాన్ని పరామర్శించి మీడియా సమావేశం పెట్టి వస్తా. పరామర్శకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు.- నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడులో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన అనూష కుటుంబాన్ని పరామర్శించాలని లోకేశ్ నిర్ణయించారు. అదే విధంగా గుంటూరులో రమ్య హత్య జరిగి 21 రోజులైనా శిక్ష వేయలేదంటూ నిరసన తెలపాలనుకున్నారు. కొవిడ్ దృష్ట్యా నారా లోకేశ్ పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు విమానాశ్రయం పరిసరాలు, జాతీయ రహదారిపై కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
లోకేశ్ పర్యటన అనుమతి నిరాకరించిన నేపథ్యంలో పలువురు తెదేపా నేతలను నిర్బంధించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజా, సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జులు చదలవాడ అరవిందబాబు, కోడెల శివరామ్, గన్నవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి బచ్చుల అర్జునుడు సహా మరికొంత మందిని గృహ నిర్బంధం చేశారు.