Srinivas Goud Murder Plan Case: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసులో నిందితులను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను మేడ్చల్ జిల్లా న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. కౌంటర్ దాఖలు చేయాలని నిందితుల తరఫు న్యాయవాదికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేసిన తర్వాత ఈ కేసుపై వాదనలు జరిగే అవకాశం ఉంది.
ఈ కేసులో ఏడుగురు నిందితులను కస్టడీకి ఇవ్వాలని పేట్ బషీరాబాద్ పోలీసులు కోరారు. నిందితులు తుపాకులను ఎక్కడ కొనుగోలు చేసిన విషయం తెలుసుకోవాల్సి ఉందని.. 15కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలని అనుకున్నారనేది ప్రశ్నించాల్సి ఉందని పోలీసులు పిటిషన్లో పేర్కొన్నారు.
జితేందర్ రెడ్డి పీఏ రాజు.. పోలీసుల ఎదుట సోమవారం హాజరయ్యే అవకాశం ఉంది. రాజుకు రెండు రోజుల క్రితం పోలీసులు నోటీసులు జారీ చేశారు. తన భార్య అనారోగ్యం కారణంగా వెంటనే రాలేనని... పోలీసులకు రాజు తెలిపారు. రాజు సోమవారం వస్తే అతడి నుంచి నిందితులకు సంబంధించిన వివరాలను పోలీసులు తెలుసుకునే అవకాశం ఉంది.
ఈ కుట్ర కేసులో నిందితులైన రాఘవేందర్ రాజు, మధుసూదన్ రాజు, మున్నూరు రవిని దిల్లీలో ఉన్న జితేందర్ రెడ్డి అతిథిగృహంలో ఎస్ఓటీ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అతిథిగృహానికి ముగ్గురు నిందితులు ఎందుకు వచ్చారు..? ఈ హత్య కుట్ర విషయం ముందుగానే తెలుసా..? అనే విషయాన్ని రాజు నుంచి తెలుసుకునే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: