బియ్యం పంపిణీ చేశారు. వాటిని తీసుకున్న లబ్ధిదారులు వంట చేసుకోవడానికి సిద్ధమయ్యారు. బియ్యాన్ని శుభ్రం చేసి వండుకుని తిందామని చూస్తే బియ్యం సాగుతున్నాయి. అనుమానం వచ్చి కొన్ని బియ్యం గింజలను నీటిలో వేయగా తేలుతున్నాయి. మరికొన్నింటిని నిప్పులో వేయగా ప్లాస్టిక్ వాసన వచ్చింది. తమకు ప్లాస్టిక్ బియ్యం పంపిణీ చేశారంటూ లబ్ధిదారులు ఆందోళన చేపట్టిన ఘటన ఏపీలోని ఎం.మాకవరంలో చోటుచేసుకుంది.
ఏపీ విశాఖ జిల్లా కొయ్యూరు మండలంలోని ఎం.మాకవరం జీసీసీ డిపో నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేసిన బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉండటంపై లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం పంపిణీ చేసిన బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉండటాన్ని వారు గుర్తించారు. పంపిణీ అనంతరం ఇంటికి తీసుకెళ్లి వండుకోవడానికి సిద్ధమవుతున్న క్రమంలో ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తించామని స్థానికులు చెబుతున్నారు. ఇవి విరవడానికి ప్రయత్నిస్తే విరగలేదని, నీటిలో నాన బెడితే సాగుతున్నాయని పలువురు ఆరోపించారు.
ఈ విషయమై... జీసీసీ డిపో ఎదుట స్థానికులు ఆందోళన చేపట్టారు. భాజపా రాష్ట్ర గిరిజన మోర్చా కార్యదర్శి లోకుల గాంధీ తన బృందంతో గ్రామానికి స్థానికులతో మాట్లాడారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమై తహసీల్దార్ తిరుమలరావుని ఫోనులో సంప్రదించగా అంగన్‌వాడీ ద్వారా ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. ఇవి కొంచెం తేడాగా ఉంటున్నాయని చెప్పారు.
ఇదీ చూడండి: Etela Rajender: 'నిజాలు చెప్పినందుకే.. మంత్రి పదవి పోయింది'