తమను ప్రభుత్వం వంచించిందనే ఆవేదనలో ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువత ఉన్నారని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తెలిపారు. వారికి న్యాయం చేసే వరకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు 2.50 లక్షల ఉద్యోగాలు ఇస్తామని వైకాపా హామీ ఇవ్వడంతో 30 లక్షల మంది యువతీయువకులు ఆ పార్టీ వెంట ఉండి 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించడంలో ముఖ్య పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఇప్పుడు కేవలం 10 వేల ఉద్యోగాలే భర్తీ చేస్తామంటూ క్యాలెండర్ ప్రకటించడంతో వారంతా తాము మోసపోయామని ఆవేదన చెందుతున్నారని పవన్‌కల్యాణ్ సోమవారం విడుదల చేసిన వీడియో సందేశంలో తెలిపారు.
‘పార్టీలోని నిరుద్యోగ నాయకుల కోసం కొత్త పదవులు సృష్టించి మరీ ఉపాధి కల్పించిన వైకాపా ప్రభుత్వం.. ఖాళీగా ఉన్న ఉద్యోగాలు కూడా నిరుద్యోగులకు ఎందుకు ఇవ్వడం లేదు? పార్టీ నాయకులపై ఉన్న శ్రద్ధ నిరుద్యోగ యువతపై లేదా? పట్టువస్త్రాలు, బంగారం అక్కరలేదు. ఉద్యోగాలు ఇవ్వండి చాలు.. ఎక్కడ 2.50 లక్షల ఉద్యోగాల హామీ.. ఎక్కడ 10 వేల భర్తీ ప్రకటన? ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జాబ్ క్యాలెండర్‌తో ఆందోళన చెందుతున్న నిరుద్యోగ యువతకు బాసటగా నిలుస్తూ జనసేన పార్టీ మంగళవారం అన్ని జిల్లాల్లోనూ ఎంప్లాయిమెంట్ అధికారి కార్యాలయాల్లో వినతిపత్రాలు సమర్పిస్తుంది. సమస్య పరిష్కారమయ్యే వరకు జనసేన యువతకు అండగా ఉంటుంది’
- పవన్ కల్యాణ్, జనసేన అధినేత
‘పోలీసు విభాగంలో 74 వేల ఉద్యోగాలు ఉన్నాయని గుర్తించి ఏటా ఆరు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్‌లో 460 పోస్టులే చూపించారు. పోలీసు ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న యువతీ యువకుల పరిస్థితి ఏమిటి?’ అని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని పవన్ ప్రశ్నించారు. నిరుద్యోగులు మంగళగిరి వచ్చి తన వద్ద ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు.
‘25 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకున్న లక్షల మంది ఈ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. అసలు జాబ్ క్యాలెండర్‌లో వాటి ఊసే లేదు. గ్రూపు1, గ్రూపు 2 పోస్టులు 2,000 వరకు ఖాళీగా ఉంటే కేవలం 34 పోస్టులు మాత్రమే ఉన్నట్లు చూపించారు. లక్షల మంది అర్హులు ఉంటే 34 ఉద్యోగాలా?. ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి.'
- పవన్ కల్యాణ్, జనసేన అధినేత
ఇదీ చదవండి: YS SHARMILA: నేడు పెనుబల్లిలో వైఎస్ షర్మిల 'నిరుద్యోగ నిరాహార దీక్ష'