Vitamin D New Test: కరోనా మహమ్మారి ప్రబలిన తరువాత విటమిన్-డి కి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. కొవిడ్ సోకి ఐసీయూలో చికిత్స పొందిన రోగులలో విటమిన్-డి లోపం ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. సాధారణంగా విటమిన్-డి లోపం కారణంగా చిన్న పిల్లల్లో రికెట్.. పెద్దల్లో ఆస్టియోమలాషియా వంటి రోగాలు వ్యాప్తి చెందుతాయి. ఇది మరింత తీవ్రమైతే క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులకు దారితీసే అవకాశం ఉంది. అయితే ఎంతో మంది విటమిన్-డి ని గుర్తించే వీలులేక నిర్లక్ష్యం వహిస్తుంటారు. ప్రస్తుతం విటమిన్-డి స్థాయి గుర్తించేందుకు అందుబాటులో ఉన్న కేమిల్యూమినిసెంట్ ఇమ్యునో ఎస్సై అందుబాటులో ఉంది. ఈ పరీక్ష చేసేందుకు దాదాపు 35 నిమిషాలు పడుతుంది. 500 నుంచి 800 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు.
తొమ్మిది నిమిషాల్లోనే..
దీనికి ప్రత్యామ్నాయంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని రసాయన శాస్త్ర ఆచార్యులు మురళీధర్ రెడ్డి నేతృత్వంలో సరికొత్త చికిత్సా విధానాన్ని తీసుకువచ్చారు. సెన్సిటివ్ అడ్వాన్స్డ్ మాస్ స్పెక్రోమెట్రీ(mass spectrometry) మెథడ్ ఫర్ ఎవాల్యూవేషన్ పేరిట ఈ విధానాన్ని రూపొందించారు. దీనికి తైవాన్ దేశానికి చెందిన సూచి మెడికల్ యూనివర్సిటీ ఆచార్యుడు ప్రొఫెసర్ ఆన్ రెన్ హు సహకారం అందించారు. కేవలం యాభై రూపాయల ఖర్చుతో.. తొమ్మిది నిమిషాల్లోనే విటమిన్-డి స్థాయిని గుర్తించేలా ఈ విధానాన్ని అభివృద్ధి చేశారు.
త్వరలోనే అందుబాటులోకి...
"ఈ సరికొత్త విధానంలో కేవలం తొమ్మిది నిమిషాల్లోనే విటమిన్-డి స్థాయి గుర్తించే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా కేవలం యాభై రూపాయలు మాత్రమే ఖర్చవుతుంది. సాధారణంగా.. ఇప్పటికే ప్రైవేటు ల్యాబ్స్‌లో ఉన్న పరీక్ష విధానం వల్ల కేవలం విటమిన్-డి స్థాయిని మాత్రమే గుర్తించవచ్చు. కానీ తాము అభివృద్ధి చేసిన విధానంతో విటమిన్ డి2, డి3 రకాలు కూడా గుర్తించే వీలుంది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా నిరూపితమైన విధానాన్ని ప్రజలకు అందుబాటులోకి రావడానికి మరికొంత కాలం పడుతుంది." -మురళీధర్ రెడ్డి, రసాయనశాస్త్ర ఆచార్యులు, ఉస్మానియా యూనివర్సిటీ
ఇదీ చూడండి: