ప్రభుత్వ పాఠశాలల్లో సెప్టెంబరు 1 నుంచి ఆన్‌లైన్ పాఠాలు మొదలు కానున్నాయి. డిజిటల్ తరగతులు ప్రారంభించేందుకు పాఠశాల విద్యాశాఖకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా పరిస్థితుల కారణంగా 5 నెలలుగా రాష్ట్రంలోని సుమారు 40 వేల బడులు మూతపడ్డాయి. జూన్ 1 నుంచే పలు కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలు జూమ్, స్కైప్, వేబెక్స్ వంటి యాప్‌ల ద్వారా ఆన్‌లైన్ తరగతులు మొదలు పెట్టాయి. కానీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మాత్రం ఇళ్లకే పరిమితమయ్యారు.
పాఠశాలలు మరికొన్నాళ్లు తెరిచే అవకాశాలు లేనందున.. డిజిటల్ తరగతులు నిర్వహించేందుకు విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. సెప్టెంబరు 1 నుంచి ఆరు నుంచి పదో తరగతి వరకు దూరదర్శన్ యాదగిరి, టీ శాట్ విద్య ఛానెల్ ద్వారా పాఠాలు ప్రసారం చేయనున్నారు. ఒక వేళ ఒకరిద్దరు విద్యార్థుల ఇళ్లల్లో టీవీలు లేనట్లయితే.. పాఠశాలలు, పంచాయతీ కార్యాలయంలోని టీవీలను ఉపయోగించేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సుమారు 900 డిజిటల్ పాఠాలను విద్యా శాఖ సిద్ధం చేసింది.
ఈ నెల 27 నుంచి ఉపాధ్యాయులు అందరూ పాఠశాలకు హాజరు కావాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆన్‌లైన్ తరగతులకు అవసరమైన కంటెంట్, ప్రణాళికలను ఉపాధ్యాయులు సిద్ధం చేయాలని పేర్కొంది. పాఠశాలల్లో తరగతుల నిర్వహణ, పాఠాల బోధన మాత్రం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా.. పాఠశాలల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ తెలిపారు.