గత ఏడాది(2020)లో జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించి అడ్వాన్స్‌డ్ రాసేందుకు రిజిస్టర్ చేసుకొని పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులు ఈసారి 2021 అడ్వాన్స్‌డ్‌కు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. వారు మళ్లీ జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించాల్సిన అవసరం లేదు. అడ్వాన్స్‌డ్ 2021 నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఐఐటీ ఖరగ్‌పుర్ ఈ విషయాన్ని స్పష్టంచేసింది. ఈ మేరకు ఆ సంస్థ జేఈఈ అడ్వాన్స్‌డ్ సవరణ సమాచార పత్రాన్ని ఆదివారం విడుదల చేసింది. అయితే జేఈఈ అడ్వాన్స్‌డ్, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశానికి ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు(ఏఏటీ) జరిగే తేదీలను మాత్రం తర్వాత వెల్లడిస్తామని పేర్కొంది. గతంలో జులై 3వ తేదీన పరీక్ష జరుపుతామని పేర్కొన ఐఐటీ ఖరగ్‌పుర్ కరోనా కారణంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. జేఈఈ మెయిన్‌లో అర్హత పొందిన మొత్తం 2.50 లక్షల మందికి అడ్వాన్స్‌డ్ రాసేందుకు అవకాశం కల్పిస్తారు. వారికి అదనంగా పాత విద్యార్థులకు ఈసారి అవకాశం ఇస్తున్నారు.
ముఖ్యమైన విశేషాలివీ..
- ప్రతి ఐఐటీలో కనీసం 20 శాతం సీట్లు అమ్మాయిలకు సూపర్ న్యూమరీ కింద కేటాయిస్తారు. వారు అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించడం తప్పనిసరి.
- ఏపీలో 30, తెలంగాణలో 15 నగరాలు, పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
- ఈసారి హైదరాబాద్ ఐఐటీ సౌత్ జోన్ కోఆర్డినేటింగ్ సంస్థగా పనిచేస్తుంది.
ఇదీ చూడండి: TPCC: రేవంత్ నియామకంపై హస్తం పార్టీలో అసమ్మతి సెగలు