రాష్ట్రంలో రోజు రోజుకు ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగిపోతున్నాయని... వీటిని అరికట్టడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆరోపించింది. ప్రజల ప్రాణాలకు రక్షణగా ఉండాల్సిన రక్షకభటులే కీచకులుగా మారుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఇందిరానగర్ హనుమాన్ దేవాలయం విషయంలో... లా చదువుతున్న భార్గవ్‌రాం ట్వీటర్ ద్వారా స్థానిక ఎమ్మెల్యేను ప్రశ్నించగా సీఐ సైదులు ఆ విద్యార్థిని వేధింపులకు గురిచేయటం చట్ట విరుద్దమన్నారు.
సీఐ సైదులు వేధింపుల కారణంగా భార్గవ్‌రాం ఆత్మహత్యకు యత్నించాడని... తన కుమారుడికి న్యాయం చేయాలని విద్యార్థి తల్లి విజ్ఞప్తి చేసింది. స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే సీఐ సైదులు తమ ఇద్దరు కుమారులపై కక్ష కట్టారని ఆమె ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సైదులుపై చర్యలు తీసుకోవాలని కోరారు. చట్టపరంగా చర్యలు తీసుకోకపోతే పోలీస్స్టేషన్ ముందే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని ఆమె హెచ్చరించారు.
సీఐని వెంటనే పదవి నుంచి తొలగించాలని జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడు కర్నె శ్రీశైలం డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.