Nano DAP Fertilizer: రానున్న మూడేళ్లలో మార్కెట్లోకి త్వరలో నానో డీఏపీ ఎరువు రానుంది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన ఈ ఎరువు ద్వారా.. పంటల్లో రసాయన వాడకం తగ్గడంతో పాటు.. భూమి సారం కోల్పోకుండా చేస్తుంది. నానో డీఏపీ ఎరువు ఉత్పత్తికి కేంద్రం సైతం ఆమోదం తెలిపింది. ఇందుకు కేంద్ర శాస్త్ర సాంకేతికశాఖ రూ.5.64 కోట్లు మంజూరు చేసింది.
ఏమిటీ నానో డీఏపీ.. బయోపెస్టిసైడ్?: మొక్కల్లో ఫంగస్ కారణంగా రోగ నిరోధకశక్తి తగ్గి తెగుళ్లు సోకుతాయి. కీటకాలు ఆశించి, ఉత్పత్తి పడిపోతుంది. ఈ సమస్యల నివారణకు నానో బయో పెస్టిసైడ్ (హర్పిన్ లోడెడ్ చిటోసెన్ నానోపార్టికల్స్-హెచ్‌సీఎస్‌ఎన్‌పీ) అనే సేంద్రియ పురుగుమందును హెచ్‌సీయూ పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీనికి గతంలోనే పేటెంట్ దక్కింది. సంప్రదాయ హర్పిన్ ఆధారిత సేంద్రియ పురుగుమందుతో పోల్చితే హెచ్‌సీఎస్‌ఎన్‌పీ వెయ్యింతల తక్కువ పరిమాణం మాత్రమే సరిపోతుంది. దీన్ని పిచికారీ చేస్తే మొక్కల్లో రోగ నిరోధకశక్తి పెరిగి నాలుగు వారాలపాటు ఎలాంటి తెగులు సోకకుండా పెరుగుతాయి.
* నానో డీఏపీని ఇంటర్నేషనల్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్ (ఏఆర్‌సీఐ) భాగస్వామ్యంతో హెచ్‌సీయూ గత ఏడాది అభివృద్ధి చేసింది. సంప్రదాయ డీఏపీతో పోల్చితే పరిమాణంలో నానో డైఅమ్మోనియం ఫాస్ఫేట్ (ఎన్-డీఏపీ) అయిదు వేల రెట్లు చిన్నగా ఉంటుంది. సాధారణ డీఏపీ కంటే 75 శాతం తక్కువ వినియోగిస్తే చాలు. నానో అణువులు భూమిలోకి నేరుగా చొచ్చుకెళ్లడంతో వృథా అనేది ఉండదు.
రైతులకు లాభం.. ప్రభుత్వానికి ఆదా: నానో డీఏపీ, సేంద్రియ పురుగుమందుల కారణంగా రైతులు భారీ పరిమాణంలో డీఏపీ, పురుగుమందులు కొనుగోలు చేసే ఇబ్బందులు తొలగుతాయి. కిలో లేదా లీటరు (ద్రవరూపంలో) నానో డీఏపీని వినియోగిస్తే సరిపోతుంది. దీనివల్ల ఖర్చు తగ్గి, ఉత్పత్తి పెరుగుతుంది. ఎరువుల వినియోగం తగ్గుతుంది. వాటిపై కంపెనీలకు సబ్సిడీగా అందించే సొమ్ము ఆదా అవుతుంది.
నేతృత్వం వహించేది వీరే: కేంద్రం ఆమోదం పొందిన ఉత్పత్తి ప్రాజెక్టుకు పరిశోధకుడిగా వర్సిటీ మాజీ ఉపకులపతి ప్రొ.పొదిలె అప్పారావు, సహ పరిశోధకుడిగా ప్రొ. రాహుల్ కుమార్ వ్యవహరిస్తారు. ఏఆర్‌సీఐ శాస్త్రవేత్తలు తాతా నర్సింగరావు, శ్రీధర సుధాకర శర్మ భాగస్వాములుగా ఉంటారు. శ్రీ బయోఏస్తెటిక్స్ కంపెనీ ఎండీ కేఆర్‌కే రెడ్డి పరిశ్రమ భాగస్వామిగా ఉంటూ పది శాతం ప్రాజెక్టు ఖర్చు భరిస్తారు. క్షేత్రస్థాయిలో మరోసారి పరిశోధనలు చేసి.. సదరు కంపెనీతో కలిసి ఉత్పత్తి ప్రారంభిస్తారు. వచ్చే మూడేళ్లలో భారీ పరిమాణంలో ఉత్పత్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఇవీ చదవండి: పండ్ల రసం ఇప్పిస్తానని తీసుకెళ్లి బాలికపై అత్యాచారం
"నేను చెప్పేది చెబుతా.. ఇష్టమొచ్చింది రాసుకోండి".. మీడియాపై మంత్రి రుబాబు!