ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్(cm jagan) కేసుల విచారణపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినట్లు నర్సాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు(mp raghurama krishnaraju) తెలిపారు. కేసుల విచారణ వేగవంతం చేయాలని పిటిషన్ దాఖలు చేసినట్లు వివరించారు. ఏడాదిలోగా క్రిమినల్ కేసులు విచారించాలని.. గతంలో సుప్రీం ఆదేశాలు ఇచ్చిందని అందులో పేర్కొన్నారు. ‘మా జగన్ నిర్దోషిగా బయటకు రావాలి’ అని పిటిషన్ దాఖలు చేసినట్లు రఘురామ తెలిపారు.
జనాగ్రహ దీక్షగా
జగన్ ఆగ్రహాన్నే జనాగ్రహ దీక్షగా చేపడుతున్నారని ఎంపీ రఘురామకృష్ణ(mp raghurama krishnaraju) రాజు వ్యాఖ్యానించారు. తెదేపా నేత పట్టాభిని అక్రమంగా అరెస్ట్ చేశారని వెల్లడించారు. రాష్ట్రంలో గత మూడు రోజులుగా చోటుచేసుకున్న పరిస్థితులపై ఆయన స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దుపై సుప్రీం కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశానని, త్వరితగతిన బెయిల్ రద్దుపై చర్యలు తీసుకోవాలని పిల్ ఉద్దేశమని స్పష్టం చేశారు.
డీజీపీ వ్యాఖ్యలు దారుణం
రాష్ట్రంలో ఉద్రిక్తతలకు కారణం.. పట్టాభి చేసిన వ్యాఖ్యలేనంటూ డీజీపీ సవాంగ్ చేసిన వ్యాఖ్యలను రఘురామ తప్పుబట్టారు. ప్రజలకు డీజీపీ ఏం సందేశమిస్తున్నారని.. ఆయన ఇలాంటి ప్రకటన చేయడం దురదృష్టకరమన్నారు. సీఐని కొట్టిన వైసీపీ నేతపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఏపీతో పాటు తెలంగాణలోనూ పట్టాభి వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది. జగన్ను పట్టాభి దూషించలేదు. ఉద్దేశపూర్వకంగానే గొడవలు చేస్తున్నారు. గతంలో నన్ను సైతం శాసనసభలో అవమానించారు. అయినా నేను దాన్ని సీరియస్గా తీసుకోలేదు. ఇక్కడ సీఎంను తిట్టకపోయినా అపార్థం చేసుకుని తెదేపా కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. నన్ను దూషిస్తే నా అభిమానులకు బీపీ పెరగదా అని సీఎం జగన్ అంటున్నారు. బీపీ పెరిగితే టాబ్లెట్ వేసుకోవాలి. -రఘురామకృష్ణ రాజు, నర్సాపురం ఎంపీ
మరి చంద్రబాబు విమర్శించలేదు కదా..
సకల శాఖమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి.. చంద్రబాబు 36 గంటల దీక్షపై కామెంట్లు చేస్తున్నారని.. మరి జగన్ 5 రోజులు దీక్ష చేశారు.. ఇప్పుడు సజ్జల ఎవరిని అవమానిస్తున్నారని రఘురామ ప్రశ్నించారు. పార్టీకి ఏదో న్యాయం చేయాలనుకొని సజ్జల అన్యాయం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడు వైకాపా చేసిన దీక్షలపై వ్యాఖ్యలు చేయలేదు కదా అని వెల్లడించారు. రాజ్యాంగ అధిపతి ముఖ్యమంత్రి అని సజ్జల అంటున్నారన్న ఆయన.. ఇలాంటి సలహదారుల కారణంగానే సీఎంకు చెడ్డ పేరు వస్తోందని అభిప్రాయపడ్డారు. ఇక నుంచైనా సజ్జల సరైన సలహాలు ఇవ్వాలని కోరుతున్నట్లు చెప్పారు.
356 ఒక్కటే దారి
ముఖ్యమంత్రి మెప్పు కోసం కొందరు నాయకులు ఏదేదో చేస్తున్నారని.. దీని వల్ల రానున్న రోజుల్లో పార్టీ ఇబ్బందులు పడుతుందనే భయం ఉందని రఘురామ అన్నారు. తెదేపా కార్యాలయంపై దాడి చేసిన వారిపై పోలీసులు కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదన్న రఘురామ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు చేయాలంటే ఆర్టికల్ 356 ఒక్కటే దారి అని సూచించారు. పోలీసులు గంజాయి సాగు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటే బాగుంటుందని రఘురామ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: Rajasingh on ktr: 'స్పందించమంటే విమర్శిస్తారా? మీరు వసూల్ చేస్తున్న రూ.41 మినహాయించండి'