Sankranthi- Godavari districts: ప్రముఖ సినీ దర్శకుడు వి.వి. వినాయక్, సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్, సినీ హీరో ఆది.. వారి వారి అత్తగారి ఊళ్లతో ఉన్న అనుబంధాన్ని మనతో పంచుకున్నారు. సంక్రాంతి సందర్భంగా గోదారోళ్ల అల్లుళ్లకు చేసే మర్యాదలను గుర్తు చేసుకున్నారు.
ఆ మర్యాదే వేరు
"మా అత్తగారి ఊరు ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడ. మర్యాదలైనా, రుచులైనా గోదారోళ్ల ప్రత్యేకతే వేరు. సంక్రాంతికి ఇక్కడ ఎక్కువ సందడి ఉంటుంది. తూర్పు లోగిళ్లు మర్యాదకు పుట్టినిల్లు. దర్శకుడిగా ఎంత పేరున్నా తూర్పు గోదావరి జిల్లా అల్లుడు అవ్వడమే గొప్పగా భావిస్తా. సంక్రాంతి సమయంలో ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా గడుపుతుంటా. పండగకు అల్లుడు వచ్చాడంటే అబ్బో ఆ మర్యాదే వేరు. మా అత్తగారి ఇంటికి వచ్చినప్పుడల్లా ఇంట్లోవారే కాదు చుట్టు పక్కల వారి పలకరింపులు ఎంతో బాగుంటాయి. వారు చూపించే ఆప్యాయత, అనురాగం మరువలేనివి.’’ --- వి.వి.వినాయక్, ప్రముఖ సినీ దర్శకుడు
వీధంతా ఘుమఘుమలే..
‘‘సంక్రాంతి పండగంటే ఆ ముచ్చట్లు మామూలుగా ఉండవండోయ్. మా అత్తగారు చేసే పిండివంటల ఘుమఘుమలు వీధంతా వ్యాపించేవి. సున్నుండలు, జంతికలు తిని తీరాల్సిందే. పండగ మూడు రోజులు మెనూ ప్రకారంగా చేసే పులిహోర, బూరెలు, గారెలు, గుత్తివంకాయ కూర, పచ్చిపులుసు వంటి సంప్రదాయ ఆహారంతో హాయిగా అనిపించేది. సాయంత్రమయ్యేసరికి గోదావరి గట్టుపై కూర్చుని చల్ల గాలిని ఆస్వాదిస్తూ గడిపేవాళ్లం. గోదావరి జిల్లాల్లో పుట్టడం ఓ అదృష్టం. అక్కడి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇంకా అదృష్టం.’’ ----మాధవపెద్ది సురేష్, ప్రముఖ సంగీత దర్శకుడు, రాజమహేంద్రవరం అల్లుడు.
నదీతీరం మరీ ఇష్టం...
‘‘నా భార్య అరుణతో కలిసి సంక్రాంతి పండగకు వచ్చినపుడు మూడురోజులు చాలా సరదాగా గడిచేవి. గోదావరి తీరమంటే మరీ మరీ ఇష్టం. ఎంత సేపు చూసినా తనివి తీరని అందాలవి. భోగి పండగ రోజున తెల్లవారుజామునే ఇంటి ముందు పెద్ద మంట వేసేవారు. మంట దగ్గర కొంత సమయం ఉంటే బయట చలి పోయి హాయిగా అనిపించేది. పండగ రోజున అత్తయ్య చేసే పిండి వంటలన్నీ బాగుంటాయి. ప్రత్యేకించి ఆమె చేసే ముక్కల పులుసు అంటే ఇష్టం. అక్కడ దొరికే రోజ్ మిల్క్ అంటే ఎక్కువగా ఇష్టపడతా. సంక్రాంతి అంటేనే సినిమాలకు ప్రత్యేకం. అందుకే అక్కడ ఉన్నన్ని రోజులు అందరం కలిసి సినిమాలు చూసేవాళ్లం. ప్రస్తుతం పరిస్థితులు బాగా లేని కారణంగా ఈ ఏడాది అత్తారింట్లో పండగకు హాజరు కాలేకపోతున్నాం’’. -------ఆది, సినీ హీరో, రాజమహేంద్రవరానికి చెందిన న్యాయవాది శోభనాద్రి అల్లుడు
ఇవీ చదవండి: Telangana Bhogi Celebrations: అంబరాన్నంటిన భోగి సంబరాలు.. కోలాటాలతో కోలాహలం
Sankranthi Rush in Hyderabad : సంక్రాంతి సందడి.. ప్రయాణ ప్రాంగణాలన్నీ కిటకిట
Bhogi Celebrations 2022: తెలుగు లోగిళ్లలో.. వైభవంగా భోగి సందడి