పార్లమెంటు ఆమోదించిన 3 వ్యవసాయ బిల్లుల వల్ల రాష్ట్రంపై పడే ప్రభావం, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన పనులపై వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి స్పందించారు. ‘‘ప్రస్తుతం రైతులు పండించిన పంటల్లో 50 నుంచి 55 శాతం మాత్రమే మార్కెట్లకు వస్తున్నాయి. బయట పంటలను ఎవరైనా కొనే విధానం ఇప్పటికే ఉంది. దానికి ప్రత్యేక చట్టం కేంద్రం తేవాల్సిన అవసరమేముంది? తెలంగాణ రైతు తను పండించిన పంటను దిల్లీకి తీసుకెళ్లి అమ్ముకోగలడా?" అని ప్రశ్నించారు.
"పంటల కాలనీలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రైవేటు సంస్థలకు పార్లమెంటులో ఆమోదించిన బిల్లుల ద్వారా అవకాశం కల్పించారు. ఇక భారతదేశంలో ఎక్కడ ఏ పంట పండించాలనే దానిపై ఆ సంస్థలే ప్రణాళికలు వేస్తాయి. ప్రపంచ మార్కెట్ అవసరాలను చూసుకుని ఈ సంస్థలు పంటల సాగును నిర్ణయిస్తాయి. వారు పండించే పంటలకు వారికి నచ్చిన ధర ఇస్తారు. రైతులు, ప్రజలకు అవసరమైన ఇతర పంటలు మార్కెట్‌లో సులభంగా దొరకవు. వాటిని కూడా ఇవే సంస్థలు బయటి నుంచి వారు నిర్ణయించిన ధరలకే అమ్ముతాయి." అని మంత్రి విశ్లేషించారు.
- కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులతో రాష్ట్రంపై ఎలాంటి ప్రభావం పడబోతుంది?
- ప్రత్యేకంగా రాష్ట్రం మీద పడే ప్రభావం అనేదాని కన్నా రైతుల మీద పడబోతున్న భారం గురించే మా ఆందోళన. కార్పొరేట్, బహుళజాతి సంస్థల చేతికి వ్యవసాయ ఉత్పత్తులు పోతే రైతులకు మద్దతు ధరకు భరోసా ఉండదు. తెలంగాణలో 90 శాతానికి పైగా సన్న, చిన్నకారు రైతులే. ఇప్పటి వరకు మార్కెట్లలో రైతులు పంటలు అమ్ముకుంటే తమకు ఏదైనా వివాదం తలెత్తితే మార్కెట్ కమిటీ పరిష్కరించేది. తాజా బిల్లు మూలంగా రైతులకు న్యాయం జరిగే పరిస్థితి కనిపించడం లేదు. బహుళజాతి సంస్థలతో రైతులకు వివాదం తలెత్తితే అది సంస్థలతో వ్యక్తుల పోరాటమే అవుతుంది.
- బిల్లులు పార్లమెంటు ఆమోదంతో చట్టంగా మారినట్టే కదా. ఇక రాష్ట్రం తీసుకునే చర్యలేంటి?
- రాష్ట్రాల అభిప్రాయానికి భిన్నంగా, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా పార్లమెంటులో బిల్లులు ఆమోదింపచేసుకున్నారు. ఈ బిల్లులతో రైతులకు అన్యాయం జరుగుతుందన్నది మా ఆవేదన. దీనిని రైతాంగంలోకి తీసుకెళ్తాం. ఈ బిల్లుల ప్రభావం, రైతుల ప్రయోజనాల దిశగానే మా చర్యలుంటాయి.
- కొత్త చట్టంతో వ్యవసాయ మార్కెట్లపై పడే ప్రభావం ఏంటి? ప్రస్తుతం వాటిపై ఎంత ఆదాయం వస్తోంది ? అది కోల్పోతే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఇస్తుందా?
- మార్కెట్ రుసుం రూపంలో ఏటా రూ.346 కోట్ల ఆదాయం మార్కెట్ యార్డులకు వస్తోంది. కేంద్రం నిర్ణయాలతో చెక్ పోస్టుల ఆదాయం పూర్తిగా కోల్పోతాం. మార్కెట్లలో రాష్ట్ర ప్రభుత్వాలు కోల్పోతున్న ఆదాయాన్ని ఎలా భర్తీ చేస్తారని మేం కేంద్రాన్ని ప్రశ్నించినా
సమాధానం లేదు. - వరి, పత్తి ధరలు పడిపోకుండా ఏదైనా ప్రణాళిక ఉందా?
- రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అవసరాలను గుర్తించే ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత్రిత సాగుకు నిర్ణయం తీసుకుని వరి, పత్తి సాగును ప్రోత్సహించారు. పత్తి కొనుగోలుకు ఇది వరకే భారత పత్తి సంస్థ(సీసీఐ) హామీ ఇచ్చింది. రైతుల ప్రయోజనాల విషయంలో మాకు స్పష్టమైన అవగాహన ఉంది.
- వరి, పత్తి, కందులకు మద్దతు ధరపై బోనస్ ఇచ్చే ప్రతిపాదన ఉందా?
- దేశంలో వ్యవసాయ రంగానికి రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తున్న రాష్ట్రం తెలంగాణనే. ఇంతకుమించిన బోనస్ ఉంటుందని మేం అనుకోవడం లేదు.
- రాష్ట్ర మార్కెటింగ్ వ్యవస్థను రాష్ట్రం సొంతంగా నిర్వహించే అవకాశం ఉందా?
- మార్కెటింగ్ వ్యవస్థ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగుతోంది.
- యాసంగి సీజన్‌లో నియంత్రిత సాగు అమలు చేస్తారా?
- యాసంగిలోనూ నియంత్రిత సాగు 100 శాతం అమలవుతుంది.
- ప్రస్తుత వానాకాలం సీజన్‌లో రైతులకిచ్చిన రుణాలెన్ని ? రెండో విడత రుణమాఫీకి నిధులు ఏమైనా ఇస్తారా?
- రూ.25 వేల లోపు రుణాలున్న రైతుల రుణాల పూర్తి మాఫీకి రూ.1,210 కోట్లు విడుదల చేశాం. రెండో విడత రుణమాఫీకీ ప్రణాళిక సిద్ధమవుతోంది. ఈ వానాకాలంలో రూ.31,936 కోట్ల పంటరుణాల పంపిణీ లక్ష్యానికి గాను ఇప్పటికి రూ.16,075.92 కోట్లు(17,15,577 మంది రైతులకు) రుణాలు ఇచ్చారు.
- యాసంగికి రైతుబంధు నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు?
- యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు నిధులను త్వరలో విడుదల చేస్తాం.
- తాజా బిల్లుల నేపథ్యంలో మద్దతు ధరలపై రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి భరోసా ఇస్తుంది?
- మద్దతు ధరల గురించే రైతులలో ఆందోళన అధికంగా ఉంది. మాదీ అదే ఆందోళన. తెలంగాణ ప్రభుత్వం కరోనా విపత్తులోనూ రూ.30 వేల కోట్లతో అన్ని పంటలను వందశాతం కొనుగోలు చేసింది. కొత్త చట్టం ప్రభావాన్ని బట్టి రైతుల పక్షాన నిర్ణయాలుంటాయి. వారి ప్రయోజనాలు దెబ్బతినకుండా చూస్తాం.