AP Cabinet: హెల్త్ హబ్‌ల ఏర్పాటుపై ఏపీ కేబినెట్‌లో ఆమోదం లభించిందని పేర్ని నాని వెల్లడించారు. ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఆరోగ్య రంగం బలోపేతానికి ఆస్పత్రులకు భూముల కేటాయింపులు చేశామన్నారు. పలు జిల్లాల్లో మల్టీ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి ఆమోదం లభించిందన్నారు. కాకినాడ, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ఆస్పత్రులకు 5 ఎకరాలు, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆస్పత్రులకు 4 ఎకరాలు కేటాయించినట్లు వెల్లడించారు. ఏపీ టూరిజంశాఖకు రాజమహేంద్రవరంలో 6 ఎకరాలు, బేతంచర్లలో ఎంఎస్‌ఎంఈ పార్కుకు వంద ఎకరాలు కేటాయింపులు జరిగినట్లు తెలిపారు. విద్య, వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెడుతోందని.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యాధికారులు, సిబ్బందిని నియమించామని అన్నారు. కొత్తగా 16 వైద్య కళాశాలల ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపిన పేర్ని.. నాడు-నేడు కింద ఆస్పత్రుల్లో మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.
"నవరత్నాల్లో ఒకటైన సున్నా వడ్డీ పథకం కొనసాగింపునకు నిర్ణయం. ఏప్రిల్ 22న సున్నా వడ్డీ పథకం రూ.1,250 కోట్లు విడుదల. సున్నా వడ్డీ పథకం నిధులు సీఎం జగన్ చేతుల మీదుగా విడుదల. డ్వాక్రా మహిళల రుణంపై వడ్డీని వెనక్కి చెల్లించే కార్యక్రమం. ఈసారి 98 లక్షల మంది డ్వాక్రా మహిళలు రుణాలు తీసుకున్నారు. బ్యాంకుల నుంచి అదనంగా రూ.4 వేల కోట్లు రుణం తీసుకున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో 12 పోస్టుల భర్తీకి ఆమోదం. ఉన్నత విద్యాశాఖలో 250 పోస్టులు మంజూరు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 34 పోస్టుల భర్తీ. ప్రకాశం జిల్లా దర్శి డిగ్రీ కళాశాలలో 34 పోస్టుల భర్తీ. కడపలో దంత వైద్య కళాశాలలో ప్రిన్సిపల్ పోస్టు మంజూరు." - పేర్ని నాని, మంత్రి
కేబినెట్ నిర్ణయాలివే...
- నవరత్నాలు అమల్లో భాగంగా ‘సున్నా వడ్డీ’ పథకం మూడో ఏడాది కూడా కొనసాగించేందుకు రూ.1,259 కోట్లు చెల్లించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 22న సున్నా వడ్డీ పథకం నగదు విడుదల.
- తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో 7 మండలాలలతో, 8 మండలాలతో పులివెందులలో రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
- జిల్లాల పునర్విభజనలో భాగంగా 12 పోలీస్ సబ్ డివిజన్లు, 16 పోలీస్ సర్కిళ్ల ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
- జిల్లా పరిషత్‌ల కాల పరిమితి, రిజర్వేషన్లు కొనసాగిస్తూ కేబినెట్ తీర్మానించింది.
- చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏర్పాటు చేసిన వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో కొత్తగా 12 పోస్టులు మంజూరు చేస్తూ కేబినెట్ తీర్మానించింది. ఇందులో 7 టీచింగ్ పోస్టులు, 5 నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి.
- చిరు ధాన్యాల పంటలను ప్రోత్సహించేందుకు ఏపీ మిల్లెట్ మిషన్ పాలసీని 2022-23 నుంచి 2026-27 వరకు కేబినెట్ ఆమోదించింది.
- ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్‌ఇన్‌ఫ్రాస్టక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు ఒక అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌ను, రెండు ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
- ఉన్నత విద్యాశాఖకోసం 253 పోస్టులను మంజూరు చేస్తూ కేబినెట్ తీర్మానం. ఇందులో 23 ప్రిన్సిపల్, 31 టీచింగ్ పోస్టులు, 139 నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి.
- ఏపీలోని వివిధ ప్రాంతాల్లో ఏకలవ్య పాఠశాలల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
- కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల లో 82 ఎకరాలు, నెల్లూరు జిల్లా ముత్తుకూరులో పారిశ్రామిక పార్కు కోసం 84 ఎకరాల కేటాయింపు.
- ప్రభుత్వ వైద్యులు ఎవరూ ప్రైవేటు ప్రాక్టీసు చేయకుండా నిషేధించే తీర్మానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
- శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 34 పోస్టుల భర్తీకి, ప్రకాశం జిల్లా దర్శి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 24 టీచింగ్, 10 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
ఇదీ చదవండి: గవర్నర్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కేటీఆర్.. ఏమన్నారంటే..?