తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి హార్‌దీప్ సింగ్ పూరీతో మంత్రి కేటీఆర్, ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ భేటీ అయ్యారు. పట్టణాభివృద్ధి, విమానయానశాఖలకు సంబంధించిన పలు అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి కేటీఆర్ తీసుకెళ్లారు. పట్టణ ప్రగతి, కొత్త పురపాలక చట్టం గురించి కూడా కేంద్రమంత్రికి వివరించినట్లు కేటీఆర్ తెలిపారు.
స్వచ్ఛభారత్ రూ.217 కోట్లు, అమృత్ పథకం నిధులు రూ.351 కోట్లు రావాలి. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.783 కోట్లు రావాల్సి ఉంది. పట్టణాల్లో 2 పడక గదుల ఇళ్ల నిర్మాణానికి రూ.1184 కోట్లు కోరాం. పట్టణాభివృద్ధిశాఖకు రావాల్సిన రూ.2,537 కోట్లు మంజూరు చేయాలని కోరాం. వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టును ఉడాన్ పథకంలో చేర్చాలని కోరాం. త్వరలో కేంద్ర బృందం పంపుతామని కేంద్ర మంత్రి తెలిపారు. త్వరలో వరంగల్ ప్రజలకు విమాన సేవలు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నాం. -కేటీఆర్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి.
రాష్ట్ర పనులు త్వరగా పూర్తి చేయాలని కేంద్రమంత్రి అధికారులకు సూచించినట్లు కేటీఆర్ తెలిపారు.