అందరిలా వాళ్లు.. సినిమాలు, షికార్లు, మందు పార్టీలంటూ.. జల్సాలు చేయలేదు. కరోనా సమయంలో రాష్ట్రం ఎదుర్కొంటున్న గడ్డు కాలాన్ని చూసి చలించిపోయారు. చదివేది ఇంటర్మీడియటే అయినా.. ఎంతో అనుభవం ఉన్నవారిలా ఆలోచించారు. సమాజానికి వారి వంతు చేయూత నివ్వాలని అనుకున్నారు. ప్రభుత్వం చేస్తున్న కృషిని చూసి.. ఉడుతా భక్తిగా తాము సైతం సాయం చేయాలనుకున్నారు.
లక్షన్నర విరాళం..
కొవిడ్ మహమ్మారిపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరుకు నలుగురు ఇంటర్మీడియట్ విద్యార్థులు మద్దతుగా నిలిచారు. ఛారిటీ ఫుట్ బాల్ టోర్నమెంట్ నిర్వహించి.. తద్వారా ఆర్జించిన లక్షన్నర రూపాయలను సీఎం సహాయనిధికి విరాళంగా అందజేశారు. ఈరోజు ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిసి.. ఇందుకు సంబంధించిన చెక్కును అందజేశారు.
వోల్స్స్ ఆర్లనైజేషన్ స్థాపన..
నలుగురు విద్యార్థులు వర్షిత్ నర్రా, చరిత్ రెడ్డి, సుధీష్ రెడ్డి, శరత్ రెడ్డి కలిసి వోల్వ్స్ అనే ఆర్గనైజేషన్‌ను స్థాపించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఈ ఛారిటీ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను నిర్వహించారు. భవిష్యత్‌లో ఒక ఆంబులెన్స్‌ను ప్రభుత్వానికి డొనేట్ చేసే ఆలోచనలున్నాయని విద్యార్థులు కేటీఆర్‌తో పంచుకున్నారు. తాము భవిష్యత్‌లో చేయాల్సిన పనులు, వారివారి గమ్యాలను మంత్రితో పంచుకున్నారు.
గమ్యాలు చేరుకోవాలి..
ఈ సందర్భంగా యువకులతో కాసేపు ముచ్చటించిన మంత్రి కేటీఆర్... నలుగురిని ప్రశంసించారు. యుక్త వయస్సులో సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్న విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుని.. రాష్ట్రానికి, దేశానికి మరింత సేవ చేయాలని సూచించారు. నలుగురు విద్యార్థులు వారు అనుకున్న గమ్యాలు చేరాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు.
ఇదీ చూడండి: