తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ నివాసానికి పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెళ్లారు. మరికొద్దిసేపట్లో రమణను ఎర్రబెల్లి స్వయంగా ప్రగతిభవన్‌కు తీసుకువెళ్లనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కల్పించి... తెరాసలో చేరిక విషయంలో చర్చించనున్నట్లు సమాచారం. పార్టీ మారే విషయమై కార్యకర్తలు, అభిమానులతో ఆయన ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. ముఖ్యమంత్రితో సమావేశం తర్వాత ఎల్.రమణ పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
స్తబ్దుగా శ్రేణులు..
గత కొన్ని నెలలుగా రమణ తెరాసలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై అటు రమణ, ఇటు తెరాస స్పందించలేదు. తాజాగా ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో బీసీ నేతల సమీకరణపై తెరాస దృష్టి సారించింది. అందులో భాగంగానే రమణ పేరును పరిగణనలోనికి తీసుకుంది. మరోవైపు పార్టీ అధ్యక్షుడు రమణ తెరాసలో చేరతారనే ప్రచారంపై తెదేపా శ్రేణులు స్తబ్ధుగా ఉన్నాయి. పార్టీకి ఇది మరింత దెబ్బ అని, పార్టీ పటిష్ఠానికి కృషి చేయాల్సిన రాష్ట్ర అధ్యక్షుడు రమణ వెళ్లిపోతే శ్రేణుల్లో స్థైర్యం దెబ్బ తింటుందని కొందరు భావిస్తున్నారు. ఎన్నో రోజులుగా ప్రచారం జరుగుతున్నందున ఇప్పుడేమీ నష్టం లేదని మరికొందరు అంటున్నారు.